ఆదిలాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి అందించాలని సర్కారు నిర్ణయించగా, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయకపోవడం ఆందోళనకు గురిచేస్తున్నది. సరిపడా రైస్ రాకపోవడంతో డీలర్లు దుకాణాలు మూసి ఉంచుతుండగా, ఎప్పుడిస్తారోనని లబ్ధిదారులు ఎదురుచూడాల్సి వస్తున్నది.
ఆదిలాబాద్, జూన్ 8 ( నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో 355 రేషన్ దుకాణాలుండగా, 1,91,755 రేషన్‌కార్డులున్నాయి. వానకాలం నేపథ్యంలో లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా మూడు నె లల బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో మూ డు నెలల కోటా 12,600 మెట్రిక్ టన్నులను కేటాయించింది. జూన్ 1 నుంచి బియ్యం పం పిణీ ప్రారంభం కాగా 30 వరకు కొనసాగుతుందని అధికారులు అంటున్నారు. మూడు నెలల బియ్యం తీసుకునేందుకు కార్డుదారులు దుకాణాల్లో ఈ పాస్ యంత్రంపై మూడుసార్లు వేలిముద్రలు వేయాల్సి వస్తుంది. ఫలితంగా బియ్యం పంపిణీలో జాప్యం కారణంగా దుకాణాల ముందు క్యూలైన్లు కనబడుతున్నాయి. రేషన్ దుకాణాల్లో బియ్యం నిల్వ ఉంచడానికి స్థలం లేకపోవడంతో డీలర్లు వారి నిల్వ సామర్థ్యం మేరకు బియ్యం తీసుకుపోతున్నారు. ఈ బియ్యం పంపిణీ పూర్తయిన తర్వాత మిగతా కోటా రావాల్సి వస్తుంది. మూడు నెలల క్రితం వరకు సరఫరా చేసిన ప్లోరిఫైడ్ రైస్ నిల్వలు సైతం ఉండడంతో డీలర్లు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
వానకాలం బియ్యం సరఫరా ఇబ్బందులు నివారించేందుకు ప్రభుత్వం జూన్ 1 నుంచి మూడు నెలల బియ్యం పంపిణీ ప్రారంభించినా పలు గ్రామాలకు ఇంకా సరఫరా కాలేదు. దీంతో ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులు బియ్యం కోసం రోజు దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. బియ్యం ఎప్పుడు ఇస్తారని డీలర్లను అడిగితే ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి బియ్యం రానిది తాము ఎక్కడి నుంచి ఇవ్వాలని వారు అంటున్నారు. తమకు రావాల్సిన మూడు నెలల కోటా కోసం డీలర్లు ఎంఎల్ఎస్ పాయింట్ల చుట్టూ తిరుగుతున్నామని చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి స్టేజ్-1 సరఫరాలో భాగంగా జిల్లాలోని ఐదు ఆదిలాబాద్, జైనథ్, ఉట్నూర్, ఇచ్చోడ, బోథ్ ఎంఎల్ఎస్ పాయింట్లకు చేరాల్సి ఉంటుంది. స్టేజ్-2లో భాగంగా ఐదు ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా రేషన్ దుకాణాలకు చేరవేస్తారు. రెండు దశల్లో జిల్లాకు రేషన్ బియ్యం సరఫరాలో స్టేజ్-1 సరఫరా సరిగా జరగడం లేదనే, స్టేజ్-2 సరఫరా గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని డీలర్లు అంటున్నారు. తలమడుగు మండలంలోని తలమడుగు, సుంకిడి, కుచులాపూర్, సాయిలింగి, ఝరి, రుయ్యాడి, ఉండం, తాంసి మండలంలో వడ్డాడి, గిరిగామ, కప్పర్లలో రెండు దుకాణాలు, భీంపూర్ మండలంలో గుబిడి, అర్లీ(టీ), ధనోర, నిపాని, భీంపూర్, తాంసి(కే), బెల్సరిరాంపూర్, వీటితో పాటు పలు మండలాల్లోని గ్రామాలు ఏజెన్సీ మండలాల్లోని గూడాలకు బియ్యం సరఫరా కాలేదు.
మా దుకాణానికి రావాల్సిన రేషన్ బియ్యం కోటా కోసం వారం రోజుల నుంచి ఆదిలాబాద్ ఎంఎల్ఎస్ పాయింట్ వచ్చి పోతున్నాను. ఈ నెల స్టాక్ రాకపోవడంతో ఇంకా దుకాణం తీయలేదు. స్టాక్ లేకపోవడంతో బియ్యం సరఫరాను గోదాం అధికారులు వాయిదా వేస్తున్నారు. స్టేజ్-1 సరఫరాలో భాగంగా నిజమాబాద్ నుంచి బియ్యం లారీలు సరిగా రావడం లేదు. దీంతో డీలర్లకు సరిపడా బియ్యం స్టేజ్-2లో రవాణా చేయలేకపోతున్నారు. లబ్ధిదారులు రోజూ దుకాణానికి వచ్చి మూడు నెలల బియ్యం ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. ఏమీ సమాధానం చెప్పలేకపోతున్నాం. అన్ని దుకాణాలకు బియ్యం సరఫరా అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
ఈ గ్రామంలో రేషన్ దుకాణంలో ఇంకా బియ్యం ఇస్తాలేరు. ఎందుకు అని డీలర్‌ను అడిగితే బియ్యం రాలేదని అంటున్నారు. మూడు నెలల సన్నబియ్యం ఒకేసారి ఇస్తామన్నారు. రోజు రేషన్ దుకాణం దగ్గరకు వచ్చిపోతున్నాం. తొందరగా ఇస్తే మంచిగా ఉంటుంది. వానలు పడితే పొలం పనులకు వెళ్తాం.
మా ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో 6 మండలాల్లో 120 దుకాణాలకు బియ్యం సరఫరా చేస్తాం. హమాలీలు 11 మంది ఉన్నారు. ఆరుగురు డీలర్ దుకాణాలకు బియ్యం అన్లోడింగ్ చేయడానికి పోతారు. దీంతో బియ్యం సరఫరాలో జాప్యం జరుగుతుంది. ఈ నెల 30 వరకు కార్డుదారులు బియ్యం తీసుకునే అవకాశం ఉంది. అన్ని దుకాణాలకు బియ్యం సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.