చెన్నూర్ రూరల్, జనవరి 26 : బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్ బాల్క సుమన్ సహకారంతో సోమన్పల్లిలోని నేతకాని కాలనీలో తాగు నీటి తిప్పలు తీరాయి. పక్షం రోజుల క్రితం నేతకాని కాలనీలోని బోరుకు ఉన్న విద్యుత్ మోటర్ పాడైపోయింది. ఈ విషయమై పంచాయతీ సెక్రటరీని సంప్రదిస్తే జీపీలో నిధులు లేవు.. అందుకే మరమ్మతులు చేయడం.. కొత్త మోటర్ ఏర్పాటు చేయడం కుదరని చెప్పారని స్థానికులు పేర్కొంటున్నారు. ఇక చేసేదేమీ లేక నేతకాని కాలనీ వాసులంతా మాజీ ఎంపీటీసీ తుమ్మల లావణ్య-తిరుపతి రెడ్డి వద్దకు వెళ్లి సమస్యను వివరించారు.
ఆయన మాజీ విప్ బాల్క సుమన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆపై ఆయన ఆదేశాల మేరకు మాజీ ఎంపీటీసీ తుమ్మల లావణ్య-తిరుపతిరెడ్డి కొత్త మోటర్ ఏర్పాటు చేయించి తాగునీటి కష్టాలు తీర్చారు. ఇందుకు కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై స్పెషల్ ఆఫీసర్ (ఎంపీడీవో) మోహన్‌ను వివరణ కోరగా.. కొత్త జీపీల్లో నిధులు లేనందున మోటర్లు కొని ఇవ్వడం లేదని, పాడైపోయిన వాటికి మరమ్మతులు మాత్రమే చేపిస్తున్నామని తెలిపారు. కొత్త మోటర్ ఏర్పాటు చేసుకుంటే వారికి బిల్లు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు.