చెన్నూర్ టౌన్, సెప్టెంబర్ 20 : పట్టణంలోని శనిగకుంట చెరువు మత్తడి పేల్చివేత కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూర్ పట్టణ సీఐ రవీందర్, ఎస్ఐ శ్వేతతో కలిసి పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ నెల 16న శనిగకుంట చెరువు మత్తడిని కొందరు పేలుడు పదార్థాలతో ధ్వంసం చేశారు. చెన్నూర్ నీటి పారుదల శాఖ ఏఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 20న అనుమానితులు పెండ్యాల లక్ష్మీనారాయణ (లక్ష్మణ్), భీం మధుకర్, రసమల్ల శ్రీనివాస్‌ను విచారించారు. గోగుల దానయ్యతో కలిసి నేరం చేసినట్లు వారు ఒప్పుకున్నారు. ఆపై అందరినీ అదుపులోకి తీసుకున్నారు. దానయ్య వద్ద ఉన్న కంప్రెషర్ డ్రిల్ మిషన్ ట్రాక్టర్, నాలుగు జిలెటిన్ స్టిక్స్, జీఐ వైరును స్వాధీనం చేసుకున్నారు.
చెన్నూర్ పట్టణంలోని 11 వార్డులోని శనిగకుంట చెరువును ఆనుకొని 15.20 ఎకరాలను గోదావరిఖనికి చెందిన బుచ్చిరెడ్డి వద్ద చెన్నూర్‌కు చెందిన 10 మంది గ్రూపుగా ఏర్పడి కొనుగోలు చేశారు. ఆపై ఈ భూమిని చెన్నూర్‌కు చెందిన గొడిసెల బాపురెడ్డికి అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో 4.20 ఎకరాలు మాత్రమే రిజిస్ట్రేషన్ పూర్తయ్యింది. మిగిలిన 11 ఎకరాల భూమి శనిగకుంట చెరువు ఎఫ్టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవల్)లో ఉండడంతో రిజిస్ట్రేషన్ కాలేదు.
వర్షాకాలంలో చెరువు నిండి సదరు భూమిలోకి వరద వస్తుందని, తమ భూముల వైపు భారీగా మట్టి పోయించారు. దీంతో వరద అంతా ఇండ్ల (ముంపు సమస్య పెరిగింది) వైపు రావడం మొదలైంది. ఈ సమస్య పరిష్కారం కోసం వార్డు కౌన్సిలర్ భర్త లక్ష్మణ్.. తన స్నేహితులైన భీం మధుకర్, రసమల్ల శ్రీనివాస్‌తో కలిసి మత్తడి ఎత్తు తగ్గించాలని ప్లాన్ చేశాడు. ఇందుకోసం మంచిర్యాలలోని ఏసీసీ ప్రాంతానికి చెందిన గోగుల దానయ్యను సంప్రదించారు.
ఆయన సాయంతో 13న కంప్రెషర్ డ్రిల్ మిషన్‌తో ఉన్న ట్రాక్టర్‌తో మత్తడి ఎత్తు తగ్గించే ప్రయత్నం చేశారు. అది సాధ్యం కాకపోవడంతో దానయ్య సూచనల మేరకు నల్గొండ నుంచి ఆయనకు తెలిసిన వారి వద్ద నుంచి జిలెటిన్ స్టిక్స్ తెప్పించారు. ఈ నెల 16న రాత్రి పెండ్యాల లక్ష్మణ్, రసమల్ల శ్రీనివాస్ లక్ష్మణ్ బైక్‌పై, భీం మధుకర్, గోగుల దానయ్య ట్ట్రాక్టర్ మీద శనిగకుంట చెరువు వద్దకు వెళ్లి కంప్రెషర్ డ్రిల్లర్, ట్రాక్టర్‌తో మత్తడికి రంధ్రాలు చేశారు. వాటిలో జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేల్చివేశారు.
ఈ కేసులో డాక్యుమెంట్స్, బ్యాంక్ అకౌంట్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ వివరాలు, ఆ స్థలంలో వారి ప్రమేయంపై విచారణ కొనసాగుతున్నట్లు డీసీపీ తెలిపారు. ఈ కేసును ఛేదించేందుకు కృషి చేసిన జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, చెన్నూర్ సీఐ రవీందర్, ఎస్ఐ శ్వేత, పీసీలు టిక్కయ్య, భూమన్న, అబ్దుల్ ఖదీర్‌ను డీసీపీ అభినందించారు.