దస్తురాబాద్, మే 10 : రైతులు ధాన్యాన్ని అమ్ముకోవడానికి అవస్థలు పడుతున్నారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 17 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొన్ని కేంద్రాల్లో తేమ శాతం, హమాలీల కొరత వల్ల తూకం వేయడంలో ఆలస్యం అవుతున్నది. మరికొన్ని కేంద్రాల్లో లారీల కొరతతో తూకం వేసిన బస్తాలు కేంద్రాల్లోనే నిల్వ ఉంటున్నాయి. తూకం వేసిన బస్తాలను గోదాంలకు, రైస్ మిల్లులకు తరలించకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కేంద్రాల నిండా ధాన్యం నిల్వలు ఉండడంతో అన్నదాతల పరిస్థితి ధైన్యంగా మారింది. కేంద్రాలలో 1000 బస్తాలకు పైగా ఉండి పోయినట్లు రైతులు తెలిపారు. తూకం వేసిన బస్తాలను మిల్లులు ,గోదాంలకు తరలించేందుకు లారీల కొరత ఉండడంతో బస్తాల నిల్వలు పేరుకుపోయాయి.
ఇటీవలే కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసింది. మళ్లీ వర్ష సూచన ఉండడంతో ధాన్యం కుప్పలపై, తూకం వేసిన బస్తాలపై కవర్లు కప్పి తడవకుండా కాపాడుకుంటున్నారు. అధికారులు స్పందించి పేరుకుపోయిన బస్తాలను మిల్లులకు తరలించేలా వాహనాలను కేటాయించాలని రైతులు కోరుతున్నారు. అలాగే హమాలీల కొరతతో తూకం ఆగి పోవడంతో అధికారులు హమాలీల కొరతరు తీర్చి ధాన్యం తూకం వేయాలని రైతులు వేడుకుంటున్నారు. కాగా.. గోదాం, రైస్ మిల్లులో అన్లోడ్ కావడానికి దాదాపు మూడు రోజులు పడుతున్నదని, దీంతో లారీల కొరత అనేది ఉందని, అలాగే ఒకేసారి జిల్లాలో మక్క, జొన్న, వరి పంటలు చేతికి రావడంతో లారీల కొరత వచ్చినట్లు తెలుస్తున్నది. ఈ విషయంపై తహసీల్దార్ కనక యాదవరావును సంప్రదించగా.. లారీల కొరత ఉన్నది వాస్తవం అని, ఎప్పటికప్పుడు లారీల కొరత సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు.

Adilabad5
కేంద్రాల్లో 17,996 ఉన్న ధాన్యం బస్తాలు.. 26 లారీలు అవసరం..
దస్తురాబాద్ మండలంలో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 17 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 147 మంది రైతుల వద్ద నుంచి 10.529 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసి 37 లారీలలో గోదాంలు, రైస్ మిల్లులకు పంపించారు. కాగా.. ప్రస్తుతం వరి కొనుగోలు కేంద్రాలలో ఇంకా 17,996 క్వింటాళ్ల ధాన్యాన్ని తూకం వేసినట్లు అధికారులు తెలిపారు. వరి కొనుగోలు కేంద్రాలలో 25,901 తూకం వేసిన బస్తాలు ఉన్నట్లు, ధాన్యం బస్తాలను తరలించేందుకు ఇంకా 26 లారీల అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు. లారీలు కావాలని ఉన్నత అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు.
పాండ్వాపూర్ అటవీ చెక్ పోస్ట్ వద్ద లారీల నిలిపివేత
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు నిర్మల్ నుంచి వస్తున్న లారీలను కడెం మండలంలోని పాండ్వాపూర్ చెక్ పోస్ట్ వద్ద రాత్రి 9 గంటలకు వచ్చేసరికి అటవీ శాఖ అధికారులు నిలిపివేస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు. దీంతో ఉదయం 7 గంటలకు లారీలు విడిచి పెట్టడంతో కొనుగోలు కేంద్రాలకు వచ్చే సరికి ఆలస్యం అవుతుందని అన్నారు. దీంతో లారీలు రావడం ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఉన్నతాఅధికారులకు నివేదిక పంపినట్లు తహసీల్దార్ యాదవ రావు తెలిపారు.