చెన్నూర్ రూరల్, జూలై 9: చెన్నూర్ మండలంలోని ఆస్నాద్ గ్రామ శివారులో మంగళవారం రైతులు చేపట్టిన సాగు పనులను అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. రైతులు, అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. రైతులు మాట్లాడుతూ గతంలో అధికారులు తమ భూముల వద్దకు సాగు చేయవద్దని ఇబ్బంది పెట్టగా మాజీ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చొరవతో అప్పటి అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించడంతో వివాదం సద్దుమణిగిందన్నారు.
ఇటీవల అధికారులు మళ్లీ కేసుల పేరుతో వేధిస్తుండడంతో సమస్యను ఎమ్మెల్యే వివేక్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. రైతులను ఇబ్బంది పెట్టవద్దని ఎమ్మెల్యే ఆదేశించినప్పటీకీ అధికారులు వినకుండా భూముల వద్దకు వచ్చి సాగు పనులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే వివేక్ చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.