మంచిర్యాల, ఏప్రిల్ 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలోగల ఓ ప్రైవేట్ పిల్లల హాస్పిటల్లో ఎక్స్పరీ డేట్ మందులు (ఔషధాల)తో చికిత్స అందించిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. ‘కాలం చెల్లిన ఔషధం.. ప్రాణాలతో చెలగాటం’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ఈ నెల 9న కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. సదరు హాస్పిటల్‌కు వెళ్లి తనిఖీ చేయాలని నిర్ణయించుకొని డ్రగ్ ఇన్స్పెక్టర్తో పాటు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు టీఎస్ఎంసీ సమాచారం అందించినట్లు తెలిసింది.
ఓ గంట తర్వాత వెళ్దామని టీఎస్ఎంసీ సభ్యులకు చెప్పిన అధికారులు, వెంటనే సదరు హాస్పిటల్ వైద్యుడికి సమాచారం చేరవేశారు. మేము రైడ్‌కు వస్తున్నాం.. మీరు జాగ్రత్తగా ఉండండి, ఏమైనా ఉంటే ముందే సర్దుకోండి అని సమాచారం ఇచ్చారు. అనంతరం సదరు టీఎస్ఎంసీ సభ్యుల్లో ఒకరికి పలువురు ఫోన్ చేసి రైడ్‌కు వెళ్లకముందే సార్ మీరు హాస్పిట్లో రైడ్ చేస్తున్నారంట.. తాళాలు పెట్టుకొని మరీ వెతుకుతున్నారంట.. ఎక్కడ ఉన్నారంటూ పలువురు ఫోన్లు చేయడంతో ఆయన అవాక్కైనట్లు తెలిసింది. దీంతో విషయం ముందే లీకైపోయిందని అర్థం చేసుకున్న టీఎస్ఎంసీ రైడ్‌ను విరమించుకున్నారు. అధికారులకే మాత్రమే ఫోన్ చేశానని, రైడ్‌కు వెళ్లకముందే సమాచారం లీక్ చేశారంటూ టీఎస్ఎంసీ బాధ్యులు పేర్కొంటున్నారు.
టీఎస్ఎంసీ రాకపోయినా జిల్లా అధికారులు హాస్పిటల్లో రైడ్ నిర్వహించారు. దీంతో ముందస్తు సమాచారంతో తూతూ మంత్రంగానే రైడ్ సాగిందంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పైపెచ్చు రైడ్ చేసినట్లు ఒక్క ఆధారం కూడా అధికారుల దగ్గర లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. హడావుడిగా తనిఖీలు చేశామని, ఫొటోలు తీసుకోలేకపోయామని అధికారులు చెబుతున్న నేపథ్యంలో.. ఓ ప్రైవేట్ హాస్పిటల్‌ను కాపాడటానికి అధికారులు ఎందుకు అంత తాపత్రయం పడాల్సి వచ్చిందన్నది అర్థం కాకుండా మారింది. రైడ్ విషయమై జిల్లా ఇన్చార్జి డ్రగ్ ఇన్స్పెక్టర్ చందనను వివరణ కోరగా.. సదరు హాస్పిటల్‌పై వచ్చిన వార్తా కథనాల మేరకు రైడ్ చేశామన్నారు. శాంపిల్స్ సేకరించామని, వివరణ ఇవ్వాల్సిందిగా సదరు దవాఖాన యాజమాన్యానికి నోటీసు జారీ చేస్తామని తెలిపారు. ఇంత జరిగాక కూడా అధికారులు ఇలా వ్యవహరించడంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.