దస్తురాబాద్, మార్చి 26 : రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు మద్దతు ధర, మార్కెటింగ్ సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ప్రతి ఏడాది ఆన్లైన్లో పంటల నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపడుతున్నది. వానకాలంతో పాటు యాసంగి పంటల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. దస్తురాబాద్ మండలంలో యాసంగి పంటలకు సంబంధించి నమోదు ప్రక్రియ ఇప్పటికే వందశాతం పూర్తి కాగా.. పంట లెక్క పక్కాగా తేలింది. గత ఏడాది కంటే ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగింది. గత యాసంగిలో మండల రైతులు 5600 వేల ఎకరాల్లో పంటలు సాగు చేయగా, ఈ ఏడాదిలో 7649 వేల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. మండలంలో రైతు క్లస్టర్ పరిధిలో ఏఈవోలు సర్వే నంబర్ల వారీగా ఏ పంట వేశారో వివరాలు నమోదు చేశారు.
7649 ఎకరాల్లో వివిధ పంటల సాగు
దస్తురాబాద్ క్లస్టర్లో వరి 4201, మక్క 44, పల్లి 3, నువ్వులు 50, శనగ 5, పెసర 8 ఎకరాల్లో పంటలు సాగు చేయగా, రేవోజిపేట క్లస్టర్లో వరి 3112, నువ్వులు 5, ఆయిల్‌పామ్ 11, పచ్చిమిర్చి 3 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. మండలంలో మామిడి 128 , ఆయిల్ పామ్ 79 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేశారో ఏఈవోలు నమోదు చేసుకున్నారు. సేకరించిన వివరాలు యాప్‌లో అప్లోడ్ చేశారు. పంటలు ఎంత మొత్తంలో ఉత్పత్తి అవుతున్నది తెలుసుకోవడంతో పాటు సంబంధిత వ్యవసాయ ఉత్పత్తులు మార్కెటింగ్ సదుపాయాలను కల్పించడం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్ధం చేయడానికి ఈ సర్వే వివరాలు దోహదపడుతాయి.
పంటల వివరాలు సేకరించాం
యాసంగి సీజన్లో రైతులు వేసిన పంటల వివరాలు పూర్తిగా సేకరించాం. పంటల వివరాలు ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నమోదు చేశాం. గత ఏడాది కంటే ఈ ఏడాది యాసంగి పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. క్షేత్ర స్థాయిలో సేకరించిన వివరాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. పంటల వివరాల సేకరణ రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.
-జాడి తిరుపతి, ఏఈవో, దస్తురాబాద్ క్లస్టర్