కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీలకు కొత్త పాలక వర్గాలు సోమవారం కొలువుదీరాయి. రెండేళ్లుగా ప్రత్యేకాధికారులతో కొనసాగిన పల్లెలు ఇకపై సర్పంచులు, వార్డు సభ్యుల పాలనలో ముందుకుసాగనున్నాయి. మండల ప్రత్యేక అధికారులు కొత్త పాలకవర్గాలతో ప్రమాణ స్వీకారాలు చేయించారు. ఇన్నాళ్లూ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడిపోయింది. ప్రత్యేకాధికారులు రెండేళ్లుగా గ్రామ పంచాయతీల్లో నామమాత్రపు పాలన సాగించడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు సక్రమంగా అందకపోవడంతో పల్లెల్లో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధిలో దూసుకుపోయిన పల్లెలు గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రగతితప్పాయి. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి కొత్త పాలకవర్గాలు కొలువుదీరగా, పల్లెల్లో పేరుకుపోయిన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది.
బీఆర్ఎస్ హయాంలో..
కేసీఆర్ సర్కారు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యమించ్చింది. అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసి పల్లెలను ప్రగతి బాట పట్టించింది. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా అభివృద్ధి పథంలో నడిపించి పల్లెల రూపురేఖలు మార్చింది. ఫలితంగా అనేక రంగాల్లో పల్లెలు ఉత్తమ ఫలితాలను సాధించాయి. నగరాలతో పోటీ పడి అభివృద్ధిలో ముందంజలో నిలిచాయి. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అవార్డులను సొంతం చేసుకున్నాయి. పల్లెలే దేశాభివృద్ధికి పట్టుకొమ్మలు అనే విధంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో పల్లెలు పచ్చగా కళకళళాడాయి. కానీ, గత రెండేళ్లుగా పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడం.. నిధులు సక్రమంగా రాకపోవడం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పల్లెల అభివృద్ధిపై దృష్టిసారించకపోవడంతో పల్లెలు మళ్లీ మస్యలకు నిలయాలుగా మారాయి. రెండేళ్ల తర్వాత పంచాయతీలకు కొత్తపాలకవర్గాలు సోమవారం బాధ్యతలు స్వీకరించడంతో గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించటం సవాలుగా కనిపిస్తోంది.

ప్రగతి బాట పట్టేనా..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలకు, 2874 వార్డులకు పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించాయి. రెండేళ్లుగా పాలకవర్గాలు లేక, ప్రత్యేకాధికారుల నామమాత్రపు పాలనతో ఎక్కడికక్కడ సమస్యలు పేరుకుపోయాయి. 2024 జనవరి నుంచి పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు నిలిచిపోయాయి. దీంతో గ్రామాలాభివృద్ధి కుంటుబడిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పల్లెల సంక్షేమం కోసం అమలు జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. పల్లెల్లో రోడ్లు, మురుగుకాలువల నిర్మాణాలు, పారిశుద్ధ్యం పనులు, పచ్చదనం కార్యక్రమాలు, పంచాయతీ భవనాల నిర్మాణాలు, వైకుంఠధామాలు, నర్సరీలు, పల్లెప్రగతి వంటి పథకాలకు ముందుకు సాగలేదు. పల్లెలో చేపట్టిన చిన్నిచిన్న అభివృద్ధి పనులకు కూడా బిల్లులు చెల్లించలేక చాలావరకు పెండింగ్లలో ఉన్నాయి.
సవాలుగా ప్రగతి
రెండేళ్లుగా 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులతో పాటు ఇతర అభివృద్ధి పనుల నిధులు నిలిచిపోవడంతో పల్లెల అభివృద్ధి ఆగిపోయింది. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులక్పన కూడా చేపట్టలేని పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు అధ్వానంగా మారాయి. గ్రామ పంచాయతీల ట్రాక్టర్లుకు డీజిల్ లేకపోవటం, చిన్నచిన్న మరమ్మతులు కూడా కేయించేందుకు నిధులు లేకపోవటం, కనీసం గ్రామ పంచాయతీలో పనిచేసే దినసరి సిబ్బందికి కూడా వేతనాలు సక్రమంగా చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ హయాంలో పల్లెప్రగతి ద్వారా చేపట్టిన అభివృద్ధి పథకాల నిర్వహణలేక ప్రజలకు ఉపయోగపడకుండా మారాయి. చాలా వరకు గ్రామ పంచాయితీల్లో గ్రామ కార్యదర్శులు బయట నుంచి సొంతంగా అప్పులు తీసుకువచ్చి, సొంత డబ్బులతో ట్రాక్టర్ల నిర్వహణ, గ్రామ పంచాయితీల్లో పారిశుధ్య నిర్వహణ ఇతర పనులను చేపట్టాల్సిన దుస్థితినెలకొంది. పల్లెల్లో గత రెండేళ్లుగా కుటుంపడిన అభివృద్ధి, నెలకొన్న సమస్యల నేపథ్యంలో సోమవారం కొత్తగా కొలువుదీరిన గ్రామ పంచాయతీ పాలకవర్గాలకు సవాలుగా మారింది.