భైంసా, మే 6 : భైంసా పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన ముథోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, పీసీసీ పరిశీలకులు చంద్రశేఖర్‌గౌడ్, ఎండీ అవేస్ హాజరయ్యారు. సమావేశం కొనసాగుతుండగా.. పటేల్ వర్గీయులు పార్టీలో నూతనంగా చేరిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీ కోసం కష్టపడ్డ వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని మండిపడ్డారు.
అంతేగాకుండా ఇందిరమ్మ కమిటీలలో వేరే పార్టీ సమావేశానికి వెళ్లిన వారు ఉన్నారని అనడంతో విఠల్‌రెడ్డి వర్గీయులు, పటేల్ వర్గీయుల మధ్య తోపులాట మొదలైంది. గంట సేపటి వరకు రసాభాస కొనసాగింది. అనంతరం కార్యకర్తలను సముదాయించడంతో కార్యక్రమం సజావుగా సాగింది. ఇందులో మాజీ ఎమ్మెల్యేలు వేణుగోపాలాచారి, నారాయణ రావు పటేల్, విఠల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్‌రావు పటేల్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఫారుక్ అహ్మద్, సూర్యం రెడ్డి ఉన్నారు.