కార్తీక మాసం అంటేనే పూజలు, శుభకార్యాలు, వ్రతాలకు ప్రత్యేకం. కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేస్తే పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. మరి కొందరు నదీ స్నానాలు, ఆలయ దర్శనాలు చేస్తుంటారు. వాటన్నింటిని ఒకేచోట పొందేందుకు కార్తీక మాస పూజల కోసం దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట వేదికవుతుంది. ఇక్కడ వెలిసిన శ్రీసత్యనారాయణ స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి వారి కృపకు పాత్రులవుతారు. ఈ మాసంలో తులసి పూజను దైవరూపంగా భావిస్తారు. ఈ మొక్కను పూజిస్తే సకల దోశాలు, పాపాలు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం.
దండేపల్లి, నవంబర్ 3 : మండలంలోని గూడెం గ్రామం లో ఉన్న ఆలయాల్లో శనివారం నుంచి కార్తీక సందడి ప్రా రంభమైంది. గూడెంలో ఉన్న శ్రీసత్యనారాయణస్వామి, అయ్యప్ప, షిర్డీ సాయిబాబా, ఆంజనేయస్వామి దేవస్థా నం, శనేశ్వరాలయం, సదానందస్వామి ఆలయాలు కార్తీక మాసంలో భక్తుల రద్దీతో సందడిగా మారనున్నాయి. గూ డెం గుట్టకు అతి సమీపంలోనే పవిత్ర గోదావరి ప్రవహిస్తుండడంతో భక్తుల తాకిడి పెరుగుతూ ఉంటుంది. కరీంనగర్-జగిత్యాలకు వెళ్లే ప్రధాన రహదారిలో ఆలయాలు ఉండడంతో పుణ్య క్షేత్రాలకు శోభ చేకూరుతుంది. కార్తీక మాసంలో మహిళలు వ్రతాలు, నోములు ఆచరిస్తారు. కార్తీక దీపారాదనకు ప్రాధాన్యత ఉంది.
నెలంతా భక్తుల సందడి
తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో ప్రతినిత్యంతోపాటు కార్తీక మాసంలో రెట్టింపు సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దీంతో ఈ మాసం లో ఆలయాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న పవిత్ర గోదావరి భక్తులు పవిత్ర స్నా నాలు ఆచరించి కార్తీక దీపాలు వదిలి, గంగమ్మ తల్లికి పూ జలు చేస్తుంటారు. సత్యదేవుని దర్శనం, అభిషేక పూజలు చేస్తుంటారు. సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలతోపాటు, స్వామివారి సన్నిధికి సమీపంలో ఉన్న రావి చెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేస్తుంటారు. కార్తీక పౌర్ణమి రోజున ఆలయంలో పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.
అయ్యప్ప, సాయిబాబా ఆలయాలు
సత్యదేవుని ఆలయ సమీపంలో మరో గుట్టపై ఆలయం, గుట్ట కింద సాయిబాబా ఆలయం ఉంది. అయ్యప్ప దీక్షలు కూడా ఈ మాసంలోనే ప్రారంభం అవుతాయి. కాబట్టి దీక్ష తీసుకునే వారు కూడా చాలా మంది అయ్యప్ప ఆలయానికి వచ్చి మాలధారణ చేసుకుంటారు. కార్తీక మాసంలో షిర్డీ సాయిబాబా ఆలయంలో సందడి నెలకుని ఉంటుంది.
గూడెంలో కార్తీక మాసం ప్రత్యేక పూజలు
రమాసహిత శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో ఈనెల 13 నుంచి 15 వరకు కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 13న విశ్వక్సేణ ఆరాధన, పుణ్యహవచనము, అంకురారోపణము, అగ్ని ప్రతిష్ట, నిత్యవహనము, బలిహరణం, తీర్థప్రసాద వితరణ, గోధూళిక సుముహూర్తాన తులసీ కల్యాణం 14న నిత్యహవణము, బలిహరణము, తీర్థప్రసాద వితరణ, 15న నిత్యహవణము, బలిహరణము, తీర్థప్రసాద వితరణ, కార్తీక పౌర్ణమి జాతర, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు, మహా పూర్ణాహుతి హోమం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.