నిర్మల్, జనవరి 24(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు రైతుభరోసా అందక, సకాలంలో ఎరువులు దొరకక సాగు కోసం అష్టకష్టాలు పడుతున్న అన్నదాతలకు న్యాయంగా చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకుండా రేవంత్ సర్కారు మోసం చేస్తుండడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వానకాలం ముగిసి యాసంగి ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా.. సన్నాలు సాగు చేసిన అన్నదాతలకు నేటికీ పూర్తిస్థాయిలో బోనస్ డబ్బులు అందలేదు.
నిర్మల్ జిల్లావ్యాప్తంగా 4,071 మంది రైతులకు రూ.5.46 కోట్ల బోనస్ డబ్బులు ప్రభుత్వం చెల్లించాలి. గత యాసంగిలో జిల్లా వ్యాప్తంగా 4,483 మంది రైతులు సాగు చేసిన సన్నాలకు రూ.12.86 కోట్ల బోనస్ డబ్బులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. కనీసం ఈ వానకాలంలో అయిన బోనస్ ఇస్తారేమోనన్న ఆశతో రైతులు సన్న వడ్లు సాగు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల మాటలు నమ్మి సన్నాలు సాగు చేసిన రైతులకు ఈ సీజన్లోనూ నిరాశే మిగిలింది. నెల రోజుల క్రితం వరకు కొంతమంది రైతులకు విడుతలవారీగా బోనస్ డబ్బులు చెల్లించిన ప్రభుత్వం.. మిగతా నాలుగు వేల మందికి పైగా రైతులకు బోనస్ చెల్లించడంలో జాప్యం చేస్తున్నది. వడ్లు అమ్మి రెండున్నర నెలలు దాటుతున్నా బోనస్ డబ్బులు రాకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. వడ్ల పైసలతోపాటే కొంతమందికి బోనస్ డబ్బులు కూడా వచ్చాయని, మాకెందుకు ఇవ్వరని, తామేం పాపం చేశామని బోనస్ కోసం ఎదురుచూస్తున్న రైతులు ప్రశ్నిస్తున్నారు. గత యాసంగి మాదిరిగానే ఈ సీజన్ బోనస్ డబ్బులు కూడా ఎగవేసేందుకు ప్రభుత్వం యత్నిస్తున్నదని వారు మండిపడుతున్నారు.
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మొన్నటి వానకాలంలో రైతులు సన్నాల సాగుకే మొగ్గు చూపారు. ఇందుకు ప్రధాన కారణం సాగునీటి వనరులు పుష్కలంగా ఉండడంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడమే. అయితే ప్రభుత్వం మాత్రం ఇస్తామన్న బోనస్ ఇవ్వకుండా కేవలం ప్రకటనలకే పరిమితమవుతుండడంతో రైతులు కాంగ్రెస్ సర్కారుపై తీవ్రంగా మండిపడుతున్నారు.
పంట కాల వ్యవధి ఎక్కువగా ఉండడమే కాకుండా చీడపీడల బెడదను తట్టుకొని, ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి సన్నాలు సాగు చేస్తే.. ప్రభుత్వం మాత్రం బోనస్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వానకాలం సీజన్లో 1,13,495 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది.
ఇందులో దొడ్డు రకాలు 48,934 ఎంటీఎస్ ఉండగా, సన్న రకాలు 64,560 ఎంటీఎస్ ఉన్నాయి. దొడ్డు రకాల కంటే సన్న రకం ధాన్యాన్ని 15,626 మెట్రిక్ టన్నులు అధికంగా సేకరించారు. మొత్తం 19,676 మంది రైతులు సన్నాలు సాగు చేశారు. ఇందులో 4,071 మంది రైతులకు రూ.5.46 కోట్ల బోనస్ డబ్బులు ప్రభుత్వం బకాయి ఉంది.
నాకు గత యాసంగితోపాటు మొన్నటి వానకాలంలో పండించిన సన్నవడ్లకు రావాల్సిన బోనస్ పైసలు రాలేదు. నాకున్న రెండెకరాలతోపాటు మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకొని సన్నవడ్లు సాగు చేయగా 197 సంచుల దిగుబడి వచ్చింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో 78 క్వింటాళ్ల వడ్లు తూకం వేయగా, వారం రోజులకు వడ్ల పైసలు వచ్చినయ్. వడ్లు అమ్మి రెండు నెలలు దాటినా.. ఇప్పటివరకు బోనస్ డబ్బులు రూ.39 వేలు రాలేదు. అలాగే గత యాసంగిలో కూడా నా సొంత భూమిలో సన్నాలు సాగు చేయగా, 40 క్వింటాళ్ల వరకు వడ్లు అమ్మిన. 20వేల బోనస్ డబ్బులు ఇవ్వకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది.
వడ్లు అమ్మగా వచ్చిన పైసలు పాత బాకీలకే సరిపోయినయ్. ఇప్పుడు మళ్లీ యాసంగి సాగు కోసం బ్యాంకులో బంగారు నగలు తాకట్టు పెట్టి లక్ష రూపాయలు అప్పు తీసుకున్న. కేసీఆర్ సీఎం ఉన్నప్పుడే రైతులకు అన్ని విధాలుగా బాగుండే. టైంకు రైతుబంధు రావడంతో పెట్టుబడి ఖర్చులు మీద పడేవికావు. యాసంగి పంటల సాగుకోసం నవంబర్, డిసెంబర్ నెలల్లోనే రైతుబంధు వచ్చేది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతు భరోసా సక్కగ రాకపాయే. బోనస్ ఇవ్వకపాయే. యూరియా కూడా దొరకక తిప్పలు పడుతున్నం. ఆరు బ్యాగులు అవసరం ఉంటే మూడు దొరుకుతున్నయ్. ప్రస్తుతం రైతులు సాగు చేయాలంటే మళ్లీ వడ్డీలకు బాకీ తెచ్చే పాత రోజులే అచ్చినయ్.
– దొడ్ల జ్ఞానేశ్వర్, రైతు, జామ్, సారంగాపూర్ మండలం.
ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ ఇస్తదన్న ఆశతో మొన్నటి వానకాలంలో నాకున్న ఏడున్నర ఎకరాల్లో సన్నాలు సాగు చేసిన. అధిక వర్షాలతో పంట దెబ్బతిన్నప్పటికీ, ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు తీసుకొని కష్టపడి పండించిన పంటను ప్రభుత్వానికి అమ్మిన. నేటికీ బోనస్ డబ్బులు రాలేదు. గతేడాది నవంబర్ చివరి వారంలో మొత్తం 108 క్వింటాళ్ల సన్న వడ్లు అమ్మిన. ఇందుకు సంబంధించి రూ.54 వేల వరకు బోనస్ డబ్బులు రావాలి. బోనస్ పైసల కోసం రెండు నెలలుగా ఎదురు చూస్తున్న. డబ్బులు ఎప్పుడు వస్తాయని అధికారులను అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు.
మా గ్రామం నుంచి ఐదు లోడ్ల సన్న వడ్లు అమ్మితే కేవలం ఒక లారీలోడుకు మాత్రమే బోనస్ డబ్బులు వచ్చాయి. ఇంకా నాలుగు లోడ్లకు సంబంధించి దాదాపు 50 మంది రైతులకు బోనస్ రాలేదు. వడ్ల పైసలతోపాటే బోనస్ డబ్బులు ఇస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావ్ చెప్పిన మాటలన్నీ ఉత్త మాటలేనని తేలిపోయింది. గత యాసంగిలో మా తమ్ముడు సంతోష్ పండించిన సన్నాలకు కూడా బోనస్ డబ్బులు రూ.91 వేలు రాలేదు. ఈ ప్రభుత్వంలో ఏదీ గ్యారెంటీ లేదు.
– సామ దయాసాగర్ రెడ్డి, రైతు, జామ్, సారంగాపూర్ మండలం