రాష్ట్ర సర్కారు మక్క రైతుకు మద్దతు ప్రకటించింది. రూ.1,962 గిట్టుబాటు ధరతో కొంటామని తెలిపింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర ప్రతినిధుల సభకు వెళ్లిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు మక్క రైతు దీనస్థితిని విన్నవించగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్కడే ఉన్న వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని సీఎం కేసీఆర్ మద్దతు ధర ప్రకటించాలని, కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బీఆర్ఎస్ సర్కారు నిర్ణయంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. కాగా.. ఈ యాసంగిలో నిర్మల్ జిల్లావ్యాప్తంగా 83 వేల ఎకరాల్లో మక్క సాగవగా.. 2.90 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
– నిర్మల్, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ)
నిర్మల్, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో రైతులు వరి తర్వాత ఎక్కువగా మక్క సాగు చేస్తుంటారు. ఈ యాసంగిలో 83వేల ఎకరాల్లో సాగు చేయగా, 2లక్షల 90వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే పంట దిగుబడులు ప్రారంభమైన మొదట్లో బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర ఉండడంతో చాలా మంది రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకున్నారు. ఇప్పటి వరకు దాదాపు లక్షా 50వేల మెట్రిక్ టన్నులకు పైగా పంటను రైతులు దళారులకు అమ్ముకున్నట్లు చెబుతున్నారు. మరో లక్షా 40వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే గతంలో ఇబ్బడిముబ్బడిగా దిగుబడులు రావడం.. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు ఆసక్తి చూపకపోవడంతో ప్రభుత్వం గత్యంతరం లేని పరిస్థితుల్లో కొనుగోళ్లను నిలిపివేసింది. అయినా మళ్లీ రైతులు యథావిధిగా మక్క సాగు చేస్తూ వస్తున్నారు.
ఈ సీజన్లో ఈ పంటకు మార్కెట్లో కొంత డిమాండ్ ఉండడంతో దళారులు సైతం మద్దతు ధరకు మించి రేటు పెట్టి కొనుగోలు చేశారు. మొదట్లో క్వింటాలుకు రూ.2100 నుంచి రూ.2300 వరకు ధరను చెల్లించారు. కాగా పంట దిగుబడులు పెరగడంతో 10 రోజుల నుంచి దళారులు రైతుల అవసరాన్ని, బలహీనతను ఆసరా చేసుకొని క్రమంగా ధర తగ్గిస్తూ వచ్చారు. కొద్ది రోజుల నుంచి క్వింటాలు మక్కకు రూ.1700 నుంచి రూ. 1800 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో రైతులు ధర విషయంలో నష్టపోయారు. మక్క కొనుగోలు సమస్య క్రమంగా తీవ్రమవడంతో ప్రభుత్వం, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొనిసంబంధిత అధికారులతో చర్చించింది. క్వింటాలుకు రూ.1962 మద్దతు ధర నిర్ణయించింది.
గురువారం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ ప్రతినిధుల సమావేశంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు, ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి మక్క కొనుగోలు సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఎం అక్కడికక్కడే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి మక్క కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలంటూ ఆదేశించారు. దీంతో జిల్లా రైతులు సంబరపడుతున్నారు. కాగా, సర్కారు తీసుకున్న నిర్ణయంతో దళారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రభుత్వం మక్క కొనుగోలు చేయదని భావించిన దళారులు, రైతుల అవసరాలతో ఆటలాడుకుంటూ వస్తున్నారు. సిండికేట్‌గా మారి, మరింత ధర తగ్గించేందుకు వారు చేసిన ప్రయత్నాలను సర్కారు తిప్పికొట్టింది.