కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): జిల్లాలో పులి అలజడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నది. ముఖ్యంగా కాగజ్‌నగర్ డివిజన్లో నిత్యం ఏదో ఒక చోట పులి కనిపిస్తూనే ఉన్నది. ఇటీవల ఇద్దరిపై పులిదాడి చేసిన నేపథ్యంలో అటవీ అధికారులు దాని జాడను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇటిక్యాల్పాడ్ అటవీ ప్రాంతంలో 20 సీసీ కెమెరాలు, కాగజ్‌నగర్ డివిజన్లోని అటవీ ప్రాంతంలో 80 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మంగళవారం వాంకిడి మండల కేంద్రానికి సమీపంలో చేనులో పని చేస్తున్న శంకర్‌కు పులి గాండ్రింపులు వినపడగా, స్పృహ కోల్పోయాడని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. రైతు శంకర్‌కు చెందిన పత్తి చేనులో పరిశీలించారు. పులి సంచరించిన ఆనవాళ్లు కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
మంగళవారం సిర్పూర్-టీ మండలంలోని పెద్దబండ గ్రామంలోని రైస్‌మిల్లు సమీపంలో ఉన్న పత్తి చేనులో పులి సంచరించడాన్ని వాహనదారులు చూసినట్లు తెలుస్తోంది. ఇటిక్యాలపాడ్, పెద్ద బండ గ్రామాల మధ్యలో పులిసంచారం ఎక్కువగా ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు. దహెగాం మండలం రాళ్లవాగు సమీపంలో జంటపులులు సంచరించినట్లు, వాగులో నీళ్లు తాగుతున్నట్లు సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించాయి. జిల్లాలో పులులు సంచారాన్ని ఆసరగా చేసుకుంటున్న కొంత మంది సోషల్ మీడియాలో ఫేక్ వార్తలను వ్యాప్తి చేస్తూ ప్రజలను మరింత భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
యానిమల్ ట్రాకర్స్‌తో జల్లెడ
కాగజ్‌నగర్ అటవీ డివిజన్లో మనుషులపై, పశువులపై పులి దాడులు జరిగిన నేపథ్యంలో 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 35 యానిమల్ ట్రాకర్స్ బృందాల(140 మంది)తో గాలింపులు చేపడుతున్నారు. ఓ వైపు డ్రోన్ కెమెరాలు, మరోవైపు ట్రాకర్స్, సీసీ కెమెరాలతో వెతుకుతున్నా పులి జాడను మాత్రం అధికారులు గుర్తించలేకపోతున్నారు. గతంలో పులిని పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేసిన అధికారులు ఈసారి మాత్రం ఆ ప్రయత్నం చేయడం లేదు. అటవీ సమీప ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో పులి సంచరిస్తుండడంతో రైతులు, రైతు కూలీలు గజగజ వణికిపోతున్నారు.
చర్లపల్లిలో చిరుత పులి సంచారం
బెల్లంపల్లి, డిసెంబర్ 3 : చర్లపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. మంగళవారం పులి అడుగులను చూసిన స్థానికుడు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎఫ్ఆర్వో పూర్ణచందర్ ఆధ్వర్యంలో అటవీ అధికారులు అక్కడికి వెళ్లి అడుగులను పరిశీలించి అది చిరుతపులి అడుగులే అని నిర్ధారించారు. చిరుత పులి ఎల్లారం, చర్లపల్లి గ్రామం మీదుగా కన్నెపల్లి, భీమిని మండలాలకు వెళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రజలు అప్రమత్తం ఉండాలని హెచ్చరించారు.