మంచిర్యాలటౌన్, సెప్టెంబర్ 28 : మంచిర్యాల వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 525532 క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టు నుంచి నాలుగువేల క్యూసెక్కులు, క్యాచ్మెంట్ ద్వారా 196532 కూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. దీంతో ఆదివారం సాయంత్రం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 43 గేట్లు ఎత్తి 684720 క్యూసెక్కుల నీటిని దిగువకు వదలగా, గోదావరి నిండుగా ప్రవహిస్తున్నది.
సమీపంలోని గౌతమేశ్వరాలయం ముందు వరకు వరద వచ్చింది. పుష్కరఘాట్లు, సమ్మక్క, సారలమ్మ గద్దెలు, స్నానఘట్టాలు నీట మునిగాయి. నిండుగా ప్రవహిస్తున్న గోదావరిలోకి రాళ్లవాగు కలిసే చోట నీటి ప్రవాహం వెనక్కి తన్నుతున్నది. దీంతో సమీపంలోని ఎన్టీఆర్ కాలనీలోకి వరద వచ్చి చేరింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు, పశువుల కాపరులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
పరిశీలించిన కలెక్టర్
మంచిర్యాల గోదావరి తీరాన్ని ఆదివా రం కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించా రు. నీటిమట్టం పరిస్థితిని ఎప్పటికప్పు డు పర్యవేక్షించాలని, పోలీస్ శాఖ బందోబస్తు ఏర్పాటు చేయాలని, మున్సిపల్ అ ధికారులతో సమన్వయంతో పనిచేయాలని, గోదావరి వైపు ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.