కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : వట్టివాగు ప్రాజెక్టు భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతున్నది. యేటేటా ఓపెన్‌కాస్టు మట్టితో ప్రాజెక్టును నింపుతుండగా, మున్ముందు ఆయకట్టు సాగు కష్టమేనన్న ప్రశ్న తలెత్తుతున్నది. ఇక ప్రస్తుతం కాలువలకు మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో సాగు నీరందించలేమని, రైతులు ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని యంత్రంగాం సూచిస్తున్నది.
నీరున్నా ఉపయోగం సున్నా
జిల్లాలోని కుమ్రం భీం ప్రాజెక్టు తర్వాత చెప్పుకోదగ్గది వట్టివాగు ప్రాజెక్టు. దాదాపు 27 వేల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో దీనిని నిర్మించారు. 2.06 టీఎంసీల నీటి సామర్థ్యంతో దీనిని నిర్మించారు. 2001లో ఈ ప్రాజెక్టును పూర్తి చేసినప్పటి నుంచి ఏ యేడాది కూడా పూర్తిస్థాయిలో సాగు నీరందించలేకపోయింది. ప్రాజెక్టులో నీటి నిల్వలు ఉన్నప్పటికీ వాటిని పంటలకు వినియోగించలేని దుస్థితి నెలకొంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 2.00 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నపటికీ కనీసం యాసంగి పంటలకు కూడా నీరు అందించలేని పరిస్థితి ఉంది.
పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కలిసి ప్రాజెక్టులోని నీరు రైతులకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. కాలువలకు మరమ్మతులు చేయకపోవడం.. పూడికతో నిండిపోవడం.. ఎక్కడికక్కడ ధ్వంసం కావడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. 27 వేల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం 1500 ఎకరాలకు మాత్రమే సాగు నీరందిస్తున్నది. ఈ ఏడాది కాలువల మరమ్మతులకు నిధులు మంజూయ్యాయని చెబుతున్న అధికారులు, వేసవిలో కాలువల మరమ్మతులు చేయనున్న కారణంగా నీరివ్వడం సాధ్యం కాదని, కనుక రైతులు ఆరుతడి పంటలను మాత్రమే వేసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో ప్రాజెక్టు కింద సాగవుతున్న ఆ మాత్రం సాగు కూడా ప్రశ్నార్థకంగా మారింది.
సాగు నీటికి బ్రేక్..
వట్టివాగు ప్రాజెక్టు ఆయకట్టుపై రైతులు ఆశలు వదులుకోవాల్సి వస్తోంది. కాలువల మరమ్మతుల కారణంగా యాసంగిలో వరిసాగుకు పూర్తిస్థాయిలో నీరు అందించలేమని అధికారులు ప్రకటించారు. ప్రాజెక్టు కింద ఆరుతడి పంటలు మాత్రమే సాగుచేసుకోవాలని సూచిస్తున్నారు. 27 వేల ఎకరాలకు సాగునీరందించాల్సిన ఈ ప్రాజెక్టు ఆయకట్టును అనేక ఏళ్లుగా పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం సుమారు 2 వేల లోపు ఎకరాలకు సాగునీరందుతోంది. ఓపెన్ కాస్టు పూడికమట్టితో ఓ వైపు నీటి సామర్థ్యం తగ్గిపోయింది. మరోవైపు కాలువలకు మరమ్మతులు చేయకపోవడంతో పంటలకు సాగునీరందించే పరిస్థితి లేకుండా పోతున్నది. ఆసిఫాబాద్, రెబ్బెన మండలాల్లోని పంటలకు సాగు నీరందించే ఈ ప్రాజెక్టు.. కేవలం రెబ్బెన మండలంలోని కొద్దిపాటి పంటలు మాత్రమే నీరందిస్తున్నది. ఈ ఏడాది కాలువల మరమ్మతులకు రూ. 60 లక్షలు మంజూరయ్యాయని, ఆ కారణంగా పంటలకు నీరు ఇవ్వలేమని, రైతులు ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
వరి సాగు వద్దు..
వట్టివాగు ప్రాజెక్టు ద్వారా వారబంధీ విధానంలో అధికారులు సాగునీటిని విడుదల చేస్తున్నారు. డిసెంబర్ ఒకటి నుంచి విడుతల వారీగా ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తున్న అధికారులు మార్చి 31 వరకు ఇదే పద్ధతిలో నీటిని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఏప్రిల్, మే నెలల్లో కాలువల్లో పూడికతీత, ఇతర మరమ్మతుల పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. వట్టివాగు కింద రైతులు వరి పంటను సాగు చేయవద్దని సూచిస్తున్నారు. దీంతో రైతులు వరి సాగును వదిలేసి ఆరుతడి పంటలు వయాలని భావిస్తున్నారు. వరి సాగుచేస్తే మార్చినాటికి పంట పూర్తికాకపోవతే నష్టాలను చూడాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 30 ఏళ్ల క్రితం నిర్మించిన వట్టివాగు ప్రాజెక్టు పాలకులను పట్టించుకోకపోవడంతో పూర్తిగా ధ్వంసమయ్యాయి. చాలా చోట్ల కాలువలు కూలిపోవడం, పూడిక, గడ్డి మొక్కలతో కాలువలు ఆనవాళ్లు కోల్పోయాయి. దీంతో ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసినా పంటలకు వరకు నీరు చేరే పరిస్థితి లేదు.
వరి సాగు వద్దు
వట్టివాగు ప్రాజెక్టు గల రెండు ప్రధాన కాలువలతోపాటు 18 చిన్న కాలువలు ఉన్నాయి. కుడికాలువ 21 కిలోమీటర్లు, ఎడమ కాలువ ఏడు కిలోమీటర్ల ఉన్నాయి. ప్రధాన కాలువలతో పాటు చిన్నకాలవల్లో సైతం పూడిక పేరుకుపోయింది. కాలువల మరమ్మతులకు టెండర్లు పూర్తికావడంతో ఈ వేసవిలో మరమ్మతులు చేసేందుకు నీటి పారుదల శాఖ అధికారులు చర్యలు చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా ఆయకట్టుకు నీరు విడుదల చేసేందుకు వారబంధీ పద్ధతిని అమలు చేస్తున్నారు. వారానికోసారి మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. వరి పంట సాగు చేయరాదని చెబుతున్నారు. ఆరుతడి పంటలైన మొక్కజొన్న, గోదుమ, వేరుశనగా, శనగా ఇతర చిరుధాన్యాలను మాత్రమే సాగుచేయాలని సూచిస్తున్నారు. ఓపెన్‌కాస్ట్ మట్టికారణంగా కూడుకుపోతున్న వట్టివాగు ద్వారా రాబోయే రోజుల్లో పంటలు సాగుచేయటం కష్టమేన్న అనుమానాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు.