మంచిర్యాల, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా మందమర్రిలోని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడికి చెందిన ఫంక్షన్ హాల్‌తో పాటు 2.10 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోనున్నది. మందమర్రి ప్రాంతం షెడ్యూల్ ఏరియాస్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ ,1970(ఎల్టీఆర్ 1/70)లో ఉన్నది. నిబంధనల ప్రకారం ఇక్కడున్న భూముల క్రయవిక్రయాలు కేవలం ట్రైబల్స్ టు ట్రైబల్స్ మధ్యలోనే జరగాలి. తాత ముత్తాల నుంచి వస్తున్న ఆస్తులను ఈ ప్రాంతంలో ఉన్న నాన్ ట్రైబల్స్ విక్రయించాలనుకుంటే కేవలం ట్రైబల్స్‌కి మాత్రమే విక్రయించాలి.
వేరే వర్గాల వ్యక్తులు ఇక్కడు భూములు కొనడం, అమ్మడం చట్టవిరుద్ధం. ఒకవేళ ఎవరైనా కొనుగోలు చేసినా అది చెల్లుబాటు కాదు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా నాన్ ట్రైబల్స్ భూములు విక్రయించినా, కొనుగోలు చేసినా ఎల్టీఆర్1/70లోని సెక్షన్ 3(1) ఉల్లంఘన కిందకు వస్తుంది. ఇలాంటి సమయాల్లో ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పరిరక్షించాల్సి ఉంటుంది. ఇదే ఇప్పుడు మందమర్రి ఇందు గార్డెన్స్ విషయంలోనూ జరగనున్నది.
షెడ్యూల్ ప్రాంతమైన మందమర్రిలో సర్వే నంబర్ 350/2/4లో 2.10 ఎకరాల భూమిని చట్ట విరుద్ధంగా బదలాయించారు. మున్సిపాలిటీ అనుమతి నిరాకరించినా అక్రమంగా అక్కడ ‘ఇందు గార్డెన్స్’ పేరుతో ఫంక్షన్ హాల్ నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. పూర్తిగా చట్టవిరుద్ధంగా జరిగిన ఈ వ్యవహారంలో సదరు ఫంక్షన్ హాల్‌తో పాటు ఆ సర్వే నంబర్లోని 2.10 ఎకరాలను ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకోవాలని ఉట్నూర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (ట్రైబల్ వెల్ఫేర్) కు నాల గంగాధర్ మందమర్రి తహసీల్దార్‌ను ఆదేశించారు. ఈ మేరకు ఈ నెల 16న ఆదేశాలు సైతం జారీ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా..
2016 నుంచి నానుతున్న వ్యవహారం..
షెడ్యూల్ ఏరియాగా ఉన్న మందమర్రి సర్వే నంబర్ 350లో ఓ నాన్ ట్రైబల్ వ్యక్తి నుంచి మరో నాన్ ట్రైబల్ వ్యక్తి భూమిని కొనుగోలు చేశారని ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం అధ్యక్షుడు, మరో వ్యక్తి 2016లో కేసు వేశారు. చట్టవిరుద్ధంగా జరిగిన భూ బదాలాయింపుపై ఆధారాలను ఉట్నూర్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ కోర్టుకు సమర్పించారు. ఈ మేరకు విచారణ చేపట్టిన కోర్టు ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని, ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటూ 2016, మార్చి3వ తేదీన ఆదేశాలు ఇచ్చింది.
దీనిపై అవతలి వ్యక్తులు హైకోర్టు ఆశ్రయించగా, ట్రైబల్ వెల్ఫేర్ కోర్టుకే సిఫార్సు చేసింది. ఈ మేరకు తిరిగి విచారణ చేపట్టిన ఉట్నూర్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ కోర్టు 2025 మార్చి, ఏప్రిల్, మే, జూలై, అక్టోబర్, నవంబర్ నెలల్లో వివిధ తేదీల్లో మందమర్రి తహసీల్దార్, మందమర్రి మున్సిపల్ కమిషనర్లతో పాటు కేసు వేసిన వ్యక్తులు, అక్రమ భూ క్రయవిక్రయాలు చేసిన వ్యక్తులను విచారించింది. సాక్షాధారాలు అన్నింటినీ పరిశీలించిన అనంతరం 2.10 ఎకరాల్లో ఉన్న ఫంక్షన్ హాల్‌తో పాటు మొత్తం భూమిని స్వాధీనం చేసుకోవాలని ఉట్నూర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
అధికారులపై తీవ్రమైన ఒత్తిడి..
ఫంక్షన్‌హాల్ సహా భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుందని తెలిసి అడ్డుకునేందుకు అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులతో పాటు మండల తహసీల్దార్లపై సదరు నాయకుడు ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మందమర్రిలో నేను ఒక్కడినే కాదు, నా లాంటి వాళ్లు చాలా మంది ఉన్నారని, ప్రభుత్వం నా భూమి స్వాధీనం చేసుకుంటే, మిగిలిన వారి భూమిని సైతం స్వాధీనం చేసుకోవాలంటూ ఆయన వాదిస్తున్నట్లు సమాచారం. ఫంక్షన్ హాల్ చుట్టు పక్కన ఉన్న భూములు ప్లాటింగ్ చేసి వేరే వాళ్లకు విక్రయించిన సదరు లీడర్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే కస్టమర్లకు ఏం సమాధానం చెప్పాలో తెలియక సతమతం అవుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఈ విషయం తెలిసిన పలువురు కస్టమర్లు ఇప్పటికే ఆయనను సంప్రదించడంతో అలాంటిదేమీ జరగదని, మంత్రి నా కోసం నేరుగా వస్తారని చెప్పున్నట్లు తెలిసింది. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆదేశాలతో హైరానా పడిపోయిన సదరు నేత హుటాహుటిన కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి లీడర్‌తో జిల్లా ఉన్నతాధికారులను కలిసి పైరవీలు ముమ్మరం చేసినట్లు తెలిసింది. చట్టవిరుద్ధంగా వ్యవహరించి అడ్డంగా దొరికిపోయాక కూడా ప్రభుత్వ ఆదేశాలను అడ్డుకునేందుకు సదరు నేత ప్రయత్నిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వ్యక్తికి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రి వత్తాసు పలకడం ఏంటన్నది ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇంత జరిగాక కూడా మంత్రి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సదరు లీడర్‌కే సహరిస్తారా లేకపోతే చట్టప్రకారం ప్రభుత్వం తన పని చేసుకునేలా సహకరిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఈ విషయంపై మందమర్రి తహసీల్దార్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్లో అందుబాటులోకి రాలేదు.