కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : ఆసిఫాబాద్ జిల్లా అడవులు.. ఇక టైగర్ రిజర్వు ఫారెస్ట్‌గా మారనుండగా, ప్రాధాన్యం సంతరించుకున్నది. జిల్లా మొత్తంగా 244540 హెక్టార్లలో అడవులుండగా, ఇందులో 149288.88 హెక్టార్ల(మూడోవంతు)ను టైగర్‌జోన్‌గా మార్చేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది.
పులుల సంరక్షణ ప్రాంతంగా..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్ టైగర్ రిజర్వు ఏర్పాటు చేసి ఏళ్లు గడుస్తున్నా.. పెద్దపులులు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోలేదు. మహారాష్ట్రలోని తడోబా- అందేరి టైగర్ రిజర్వుల నుంచి కవ్వాల్కు పులులు వచ్చి పోతున్నాయి. మహారాష్ర్టాలోని తడోబా టైగర్ జోన్‌కు- కవ్వాల్ టైగర్‌జోన్‌కు మధ్య ఉన్న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవులు కీలకంగా మారాయి. తడోబా నుంచి వలస వచ్చే పులులు కాగజ్‌నగర్-ఆసిఫాబాద్ డివిజన్లలోని అడవుల్లో స్థిరనివాసం ఏర్పర్చుకున్నాయి.
యేటా పదుల సంఖ్యలో పులులు తడోబా- అందేరి టైగర్ రిజర్వుల నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని పులుల సంరక్షణ ప్రాంతంగా గుర్తించాలని అటవీశాఖ 2024లోనే ప్రతిపాదనలు చేసింది. రెండేళ్లుగా పులుల సంచారం పెరగడం.. నిత్యం వేటగాళ్ల బారినపడి పడుతుండడంతో అటవీ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నది. మహారాష్ట్రాలోని తడోబా-అందేరి టై గర్ రిజర్వులతో – కవ్వాల్ టైగర్ రిజర్వును అనుసంధానం చేసే కుమ్రం భీం టైగర్ రిజ ర్వు కన్జర్వేషన్ ప్రాంతం ఎంతో కీలకంగా మా రనున్నది.
మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ వైల్డ్‌లైఫ్ అభయారణ్యం, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వులతో కలిపే ముఖ్యమైన కారిడార్ కానున్నది. పెద్ద పులుల సంరక్షణ, ఆవాసానికి అనువైన ప్రాంతంగా ఉన్న కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ అటవీ డివిజన్లలో పులులతో పాటు చిరుతపులులు, అనేక రకాల వన్య ప్రాణులు ఉన్నాయి. జిల్లాలో సుమారు గత పదేళ్లుగా పెరుగుతున్న పులుల కారణంగా వేటగాళ్ల దా డులు కూడా పులులపై అధికమయ్యాయి. గ తంతో రెండు పులులపై విషప్రయోగం చేసిన వేటగాళ్లు ఇటీవల ఒక పులిని విద్యుత్ షాక్‌తో హతమార్చారు. పులుల సంరక్షణ కోసం కీలకమైన నిర్ణయాలు తీసుకున్న అటవీ శాఖ.. జిల్లా అడవుల్లో పులులు ఎక్కువగా సంచరించే 1492.88 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతాన్ని కుమ్రం భీం టైగర్ రిజర్వు కన్జర్వేషన్ ప్రాంతంగా మార్చింది.
భూములు వదులుకోవాల్సిందేనా..!
జిల్లాలో మూడొంతుల అడవిని టైగర్ రిజర్వు కన్జర్వేషన్ ప్రాంతంగా మార్చడంతో పోడు సాగు చేసుకుంటున్న రైతులు తమ భూములను కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన టైగర్ రిజర్వు కన్జర్వేషన్ ప్రాంతంలో పెంచికల్పేట్, బెజ్జూర్, కర్జెల్లి, సిర్పూర్, కాగజ్‌నగర్, తిర్యాణితో పాటు ఆసిఫాబాద్, కెరమెరి, రెబ్బెన రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతాలు కీలకంగా ఉన్నాయి. ఈప్రాంతాల్లోనే గిరిజన రైతులతో పాటు గిరిజనేతరులు కూడా తరతరాలుగా పోడు చేసుకుంటున్నారు. అటవీ హక్కుల చట్టం ద్వారా పొందిన ఈ భూముల్లో సాగు చేసుకునేందుకు అటవీఅధికారులు అనేక ఆంక్షలు విధిస్తూ వచ్చారు. ఆయా ప్రాంతాలను టైగర్ రిజర్వు కన్జర్వేషన్ ప్రాంతంగా మార్చడం వల్ల రైతులకు మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు.
టైగర్ కారిడార్‌తో ప్రత్యేక గుర్తింపు : పీసీసీఎఫ్ సువర్ణ
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో టైగర్కారిడార్ ఏర్పాటు చేయడం వల్ల ప్రత్యేక గుర్తింపు లభించిందని ఆదిలాబాద్ పీసీసీఎఫ్ సువర్ణ అన్నారు. జిల్లా అడవులను టైగర్ కన్జర్వేషన్ కారిడార్‌గా మార్చిన నేపథ్యంలో బుధవారం జిల్లా అటవీ అధికారులతో ఆమె ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ కారిడార్ పరిధిలోకి 339 గ్రామాలు వస్తున్నాయని, కొన్ని గ్రామాలు పూర్తి ఎఫెక్టెడ్ ఏరియా పరిధిలో ఉంటే.. మరికొన్ని ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయన్నారు. మహారాష్ట్రలోని తడోబాతో కవ్వాల్ టైగర్ రిజర్వ్‌ను కలిపే ఈ కుమ్రం భీం ఆసిఫాబాద్ కారిడార్‌తో మంచి గుర్తింపు వస్తుందని, నిధులు కూడా బాగా వస్తాయన్నారు. కేంద్రం (సీఎస్ఎస్) నుంచి 60 శాతం నిధులు కేటాయిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు ఇస్తుందన్నారు. కారిడార్ పరిధిలోకి వచ్చే ప్రభావిత గ్రామాల ప్రజలకు భధ్రత కల్పించడంతో పాటు వారికి ఉపాధి చూపుతామన్నారు.