మంచిర్యాల జిల్లా కాసిపేట మండల అటవీ ప్రాంతం పెద్ద పులులకు అడ్డాగా మారింది. పులుల ఆవాసానికి అనుకూలంగా ఉండడంతో కాసిపేట మండల శివారులో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతంలో నిత్యం వాటి సంచారం పెరుగుతున్నది. మనుషులపై దాడి చేయనప్పటికీ పశువులపై తరచూ దాడులు చేస్తుండడంతో రైతులు, గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
కాసిపేట, నవంబర్ 16 : కాసిపేట మండలంలో గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పుడు నవంబర్ వరకు పులుల సంచారం పెరుగుతూ వస్తుంది. ఏడాదిగా బీ1, ఎస్12, ఎల్1 పులులు కాసిపేట శివారులో తిరుగుతూ ఇక్కడే తిష్ట వేసి వారాల కొద్ది ఉండి వెళ్లిపోయాయి. దేవాపూర్ రేంజ్‌తో పాటు కన్నాల, బుగ్గగూడెం, పెద్దనపల్లి, దుబ్బగూడెం, ఎగ్గండి, అరడిపల్లి, వెంకటాపూర్ శివార్లలో ఇక్కడే ఉంటూ సంచరించి హడలెత్తించాయి. లక్షెట్టిపేట నుంచి ఎల్1 పులి వస్తూ వెళ్తున్నది. కాని ఇటీవల కొత్తగా మరో పులి దానికి పేరు పెట్టలేదు. తిర్యాణి పులిగా పిలిచే పెద్దపులి కాసిపేట శివారు అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ హడలెత్తిస్తున్నది. ఇక్కడ వేటాడి మళ్లీ తిర్యాని అటవీ ప్రాంతానికి వెళ్లి పోతున్నది.
ఇటీవల దేవాపూర్ రేంజ్ పరిధిలోని ఎగ్గండి, అరడిపల్లి శివారు ప్రాంతాల్లో మూడు సార్లు వేర్వేరుగా పశువులపై దాడులు చేసి హతమార్చింది. బుగ్గగూడెం శివారులో పశువులపై దాడి చేసి హతమార్చింది. పశువుల యాజమానులు, అటవీ గ్రామ శివారు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా లక్షెట్టిపేట, దేవాపూర్, బెల్లంపల్లి, తిర్యాణి అటవీ కారిడార్ పెద్దపులి రాకపోకలు సాగించే దారి సురక్షితంగా ఉండడంతో పెద్దపులులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అటవీ జంతువులకు హాని తలపెట్టవద్దని అటవీ సమీప గ్రామాల ప్రజలు, వేటగాళ్లకు అధికారులు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అడవిలో జంతువులకు నీటి సౌకర్యం కోసం కుంటల ఏర్పాటు, గడ్డి పెంపకం తదితర రక్షణ చర్యలతో జంతువులు సంఖ్య పెరిగింది. దీంతో వేటకు అనుకూలంగా మారడంతో పులుల సంచారం పెరిగింది. పశువులపై దాడులు జరిగినప్పుడు పరిహారం డబ్బులివ్వక పోవడం వల్ల కూడా యాజమానులకు కోపంతో పులులకు హాని జరిగే అవకాశాలు ఉండేవి. గతంలో విషం పెట్టి పులులు చంపిన ఘటనలు జరిగాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, వెంటనే పరిహారం ఇవ్వడంతో పులులకు ఎవరూ హాని తలపెట్టడం లేదు. కానీ పులులు సంచరిం చినప్పుడల్లా అటవీ శివారు గ్రామాల ప్రజలు మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళకు గురవుతునే ఉన్నారు.
టైగర్‌తో ప్రమాదం తక్కువ : ప్రవీణ్ నాయక్ (డిప్యూటీ రేంజర్)
ఇతర అటవీ జంతువులతో పోల్చితే టైగర్‌తో ప్రమాదం తక్కువగా ఉంటుంది. మన దగ్గర మనుషుల మీద అటాక్ చేసిన ఘటనలు లేవు. పెద్ద పులులు అటవీలో ప్రయాణం చేసే క్రమంతో ఆవాసం వెతుకుతూ దారి తప్పి గ్రామాల సమీపంలోకి వస్తున్నాయి తప్ప అవి గ్రామాలకు రావు. మన దగ్గర అటవీ ప్రాంతంలో ఆవాసం మెరుగు పడింది. అన్ని రకాలుగా అటవీ సురక్షితంగా ఉండడం వల్ల పులులు సంచారం పెరిగింది. ఆహార వసతి, నీటి వసతి, సురక్షిత ప్రాంతంగా ఉండడం, వేటకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉండడంతో పులుల సంచారం పెరిగింది.
గ్రామాల్లో పులుల రక్షణపై అవగాహన కల్పిస్తున్నాం. వాటి రక్షణకు ప్రజల సహకారం ఉంటుంది. పశువులు అటవీ లోపలికి వెళ్లడం వల్లే దాడి చేస్తున్నాయి. అటవీ శివారులో ఉండే పంట చేన్లకు వెళ్లే ప్రజలు గుంపులా వెళ్లడంతో పాటు శబ్దం చేస్తూ విజిల్లను వాడాలి. మనుషులు నిలుచోని ఉంటే దాడి చేసే అవకాశం తక్కువ. కింద పని చేస్తూ ఉంటే జంతువు అని భ్రమలో అటాక్ చేసే అవకాశం ఉంది. అటవీ ప్రాంత శివారు పశువుల కాపరులు, గ్రామస్తులు, వ్యవసాయదారులు జాగ్రత్తలు పాటించాలి. జంతువుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం, వాటికి హాని కలిగిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయి.