కర్షకుల కష్టాలకు ‘నమస్తే తెలంగాణ’ అక్షర రూపం ఇచ్చింది. కాంగ్రెస్ పాలనలో అరిగోస పడుతున్న అన్నదాతలకు అండగా నిలిచింది. రేవంత్ సర్కారు కండ్లు తెరిచేలా కథనాలు ప్రచురించింది. రైతుల కండ్లలో చిరునవ్వే లక్ష్యంగా సమస్యలపై సమరశంఖం పూరించి అధికారులను పరుగులు పెట్టించింది. పత్తి, సోయా, కంది, మొక్కజొన్న రైతుల కష్టాలు, అతివృష్టి, అనావృష్టి, కరెంటు, రైతుల ఆత్మహత్యలు, సన్నాలకు బోనస్, మిల్లర్ల కొర్రీలు, యాప్, రైతు భరోసా, రుణమాఫీ, సాగు నీటి కష్టాలు, కాల్వలు, ప్రాజెక్టుల దుస్థితి వంటి వాటిపై కథనాలు ప్రచురించి రైతులకు న్యాయం జరిగేలా పోరాడింది. సమస్యలకు పరిష్కారం చూపేలా చేసింది. ఈ క్రమంలో రైతులు ‘నమస్తే తెలంగాణ’కు కృతజ్ఞతలు తెలిపారు. మచ్చుకు కొన్ని కథనాలు ‘యాది’లో..
– మంచిర్యాల ప్రతినిధి/కమ్రం భీం ఆసిఫాబాద్/ఆదిలాబాద్/నిర్మల్, డిసెంబర్ 29(నమస్తే తెలంగాణ)
‘కాంటా’ పెట్టారు..
గతేడాది వానకాలం సీజన్‌కు సంబంధించి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. కొనుగోలు కేంద్రాలు తెరిచినప్పటికీ రోజుల తరబడి వడ్ల కొనుగోళ్లు చేపట్టకపోవడంతో ‘ఎక్కడి వడ్లు అక్కడే’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైంది. దీంతో అధికారులు స్పందించి వెంటనే కొనుగోళ్లు ప్రారంభించారు. ధాన్యం రైతులు పడుతున్న ఇబ్బందులను వెలుగులోకి తెచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేసినందుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
కలెక్టర్ ఆదేశం.. కదలిన యంత్రాంగం..
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామంలో యాసంగిలో సాగు నీరు అందక జొన్న, శెనగ, పల్లి, గోధుమ పంటలు ఎండిపోతున్నాయి. జొన్న ఎదుగు దశలో ఉండగా.. మొక్కజొన్నకు కంకులు కాస్తున్నాయి. ఈ దశలో పంటలకు నీరు అత్యవసరం. దీంతో రైతుల దుస్థితిని ‘మేతకు జొన్న’ అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ దిన పత్రికలో ప్రముఖంగా ప్రచురించింది. ఈ కథనంపై స్పందించిన ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పంటలకు నీరు అందించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. కాలువలకు మరమ్మతులు చేసి సాగు నీటిని సరఫరా చేశారు. వందలాది ఎకరాల పంటలు వట్టిపోకుండా ‘నమస్తే’ కాపాడింది. దీంతో రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
సీలింగ్ రద్దయింది.. పరిమితి పెరిగింది..
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా యేటా యాసంగిలో శెనగ అధికంగా సాగువుతుంది. ఈ యేడాది శెనగకు బదులు 79 వేల ఎకరాల్లో జొన్న సాగు చేశారు. ఎకరాకు 18 క్వింటాళ్ల చొప్పున 14 లక్షల క్వింటాళ్ల వరకు దిగువడి వచ్చే అవకాశం ఉంది. దీంతో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్, జైనథ్, ఇచ్చోడ, బోథ్, ఇంద్రవెల్లి, నేరెడిగొండ, సిరికొండ, ఉట్నూర్‌లలో పంట ఉత్పత్తులను రూ.3,371తో సేకరించాలని నిర్ణయించారు. ఎకరాకు 8.65 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని అధికారులు ప్రకటించారు. ప్రజావాణిలో రైతులు కలెకర్ట్‌ను కలిసి ఎకరాకు 18 నుంచి 20 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని వినతిపత్రం అందించారు. ఈ కథనాన్ని ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ‘జొన్నల కొనుగోళ్లపై సీలింగ్’ పేరిట కథనాన్ని ప్రచురించింది. ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, మార్క్‌ఫెడ్ అధికారులు స్పందించి ప్రభుత్వానికి పరిమితి పెంచాలని లేఖలు రాశారు. ఈ క్రమంలో ఎకరాకు 12 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
సన్నాలపై సమరం
రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యానికి రూ.500 ఇస్తమన్న బోనస్ అంతా బోగసే. ఖరీఫ్(వానకాలం) కొనుగోళ్లకు సిద్ధమవుతున్నా రబీ సీజన్ డబ్బులు జమకాలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులకు సర్కారు రూ.19.17 కోట్లు బాకీపడిందంటూ ప్రత్యేక కథనం.
రైతు భరోసా రావాలని..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వర్షాకాలంలో 4.45 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా, ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వక, బ్యాంకుల నుంచి రుణాలు పొందక అన్నదాతలు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. కేసీఆర్ పాలనలో జిల్లాలోని సుమారు 1.31 లక్షల మంది రైతులకు దాదాపు రూ. 210 కోట్ల సాయం అందగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులు పెట్టుబడికి నరకం అనుభవిస్తున్నారంటూ నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం ప్రచురించింది.
టింగ్ టింగ్ మెసేజీల్లేవ్
రైతు భరోసా రైతులందరికీ ఒకేసారి ఎందుకివ్వరు. పైలెట్ గ్రామాల్లోనే ఇస్తే ఎలా.. మిగిలిన వాళ్లంతా రైతులు కాదా అంటూ.. సర్కారును ప్రశ్నిస్తూ నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం..
సిండికేట్ కట్టడి
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి పత్తి విత్తన దందాకు తెరలేపారు. డిమాండ్ ఉన్న సీడ్స్‌ను కృత్రిమ కొరత సృష్టించి మరీ బ్లాక్‌లో విక్రయిస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారు. రూ. 850 అమ్మాల్సిన 475 గ్రాముల ప్యాకెట్‌ను రూ. 1100 నుంచి రూ. 1200 వరకూ పెంచేసి అమ్ముతూ అందినకాడికి దండుకుంటు న్నారంటూ నమస్తే తెలంగాణ ప్రత్యే కథనం ప్రచురించింది.
యాప్ అరిగోస
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ మద్దతు ధరతో పత్తిని కొనుగోలు చేస్తున్నది. గతేడాది వరకు రైతులు మార్కెట్‌కు పత్తిని తీసుకొచ్చి విక్రయించేవారు. ఈ యేడాది నుంచి కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్ చేసుకుంటేనే కొనుగోలు చేస్తున్నది. పత్తిని అనేక సార్లు సేకరిస్తారు. ఇందుకు అనుగు ణంగా యాప్ లేదు. మొదటి సారి అమ్మినపుడు వివరాలు చూపెడుతుం డగా.. రెండోసారి తర్వాత వివరాలు కనిపించడం లేదు. దీంతో రైతులు పత్తి అమ్ము కోవడానికి అవస్థలు పడుతున్నారు. దీనికితోడు నూతనంగా యూరియా కావాంటే ఫర్టిలైజర్ బుకింగ్ మొబైల్ యాప్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. ప్రభుత్వం యాప్ ద్వారా కొనుగోళ్లు, ఎరువుల అమ్మకాలు జరుపుతుండగా గిరిజన గ్రామాలు, మూరు మాలు ప్రాంతాల్లో సెల్ ఫోన్ సిగ్నళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలా రైతులకు యాప్ కష్టాలపై ‘యాప్ యాతన’ పేరిట కథనం ప్రచురించింది.
సీజన్‌కు ముందే నకిలీ దందా
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సీజన్కంటే ముందే పల్లెలో నకిలీ విత్తనాల దందా మొదలైంది. రెండు రోజుల క్రితం చింతలమానేపల్లిలో రూ.10.50 లక్షల విలువచేసే 3 క్వింటాళ్లు పట్టుబడడం ఇందుకు బలం చేకూరుస్తున్నది. పేరు.. ఊరు లేని కంపెనీల్లో తయారైన విత్తనాల ప్యాకెట్లను అమాయక రైతులకు అంటగట్టేందుకు వ్యాపారులు రంగంలోకి దిగినట్లు నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం.