కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/ వాంకిడి, నవంబర్ 23 : సర్కారు విద్యాలయా ల్లో పది రోజులకో బిడ్డ ప్రాణం పోతున్నా ప్రభు త్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజను, ఆమె కుటుంబ సభ్యులను శనివారం వారు వేర్వేరుగా పరామర్శించారు. వారు మాట్లాడుతూ 11 నెలల కాంగ్రెస్ పాలనలో 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
వాంకిడిలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్‌లో చేరిన జ్యోతి, మహాలక్ష్మి డిశ్చార్జి అయ్యారని, కానీ శైలజ పరిస్థితి మాత్రం విషమంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వసతి గృహాల్లో పురుగుల అన్నం తినలేక విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థిని ఈ స్థితికి రావడానికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి నోరు తెరిచినప్పుడల్లా కేసీఆర్ మూలాలను తుడిచేస్తానంటున్నాడే తప్ప.. గురుకుల విద్యార్థుల సంక్షేమాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.