మంచిర్యాలటౌన్, అక్టోబర్ 15 : మంచిర్యాల లారీ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతల మధ్య నిలిచిపోయాయి. అసోసియేషన్ సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడం, దాడులు చేసుకోవడం లాంటి అంశాలు గత రెండు రోజుల వ్యవధిలో జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలను నిలిపివేయాలని పోలీసుల నుంచి ఆదేశాలు రావడంతో బుధవారం జరగాల్సిన ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. అసోసియేషన్ కార్యాలయానికి తాళం వేయాల్సిందిగా పోలీసులనుంచి ఆదేశాలు వచ్చాయి.
ఎన్నిక ప్రక్రియ నిలిచిపోవడానికి ఒకవర్గానికి చెందిన సభ్యులే కారణమంటూ మరో వర్గం సభ్యులు పలువురు సభ్యులపై దాడికి పాల్పడ్డారు. ముందు నుంచి ఎన్నికలు అసోసియేషన్ నిబంధనల ప్రకారం జరగడం లేదని, సంఘం డబ్బులు లెక్కలు చెప్పకుండా సొంతానికి వాడుకున్న వారు ఎన్నికల్లో పోటీచేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఎన్నికల సమాచారాన్ని సైతం సభ్యులకు తెలియకుండా చేస్తున్నారని పలువురు సభ్యులు ఆరోపించారు. దీంతో ఎన్నికలు నిలిచిపోయాయి. ఇది జీర్ణించుకోలేని పలువురు సభ్యులు ఎన్నికలను వ్యతిరేకించిన సభ్యులపై బుధవారం దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు.
దుర్భాషలాడుతూ తమపై కే శ్రీనివాస్‌గౌడ్, కే రమేశ్, ఎం శ్రీనివాస్, రామారావు, లక్ష్మీనారాయణ అనే వ్యక్తులు దాడి చేశారని పేర్కొంటూ ఎండీ రఫీక్, ముజాహిద్ అబ్దుల్ రఫీక్, అబ్దుల్ రజాక్ అనే వ్యక్తులు పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. మంచిర్యాల లారీ ఓనర్స్ ఎన్నికల నిలిచిపోవడానికి తామే కారణమంటూ దాడి చేశారని, వీరితోపాటు మరికొంత మంది కూడా దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.