మంచిర్యాల ప్రతినిధి, లక్షెట్టిపేట, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : జిల్లా యంత్రాంగం చెరువుల అక్రమ కట్టడాలపై కొరఢా ఝుళిపిస్తున్నది. ఇందులో భాగంగా ఇటీవల లక్షెట్టిపేట-ఇటిక్యాల చెరువులను సర్వే చేసేందుకు నోటీసులివ్వగా, అందులో ప్లాట్లు చేసి విక్రయించిన రియల్టర్ల గుండెల్లో గుబులు కనిపిస్తున్నది. ఇటిక్యాలలో 333 సర్వే నంబర్లో 41.30 ఎకరాలు, లక్షెట్టిపేట శివారులో సుమారు 26 ఎకరాల ఈ చెరువులు విస్తరించి ఉన్నాయి. కొన్నేళ్లుగా ఈ చెరువుల వివాదం ఎటూ తేలకుండా పోతున్నది.
గతంలో ఈ చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయంటూ ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ హద్దులు వేసేందుకు సిద్ధమయ్యారు. కానీ కొంత మేరకు హద్దులు వేసి సగంలోనే తిరిగి వెళ్లిపోయారు. దీంతో అప్పటికే ఈ ప్రాంతంలో రియల్టర్లు, భూ పట్టాదారులు ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో ప్లాట్లు వేసి విక్రయాలు చేపట్టారు. హైవే పక్కనే ఉండడంతో హాట్ కేకుల్లా ఆ భూములు అమ్ముడుపోయాయి. కొందరైతే ఎఫ్టీఎల్ హద్దులను ఆనుకొని భారీ నిర్మాణాలు చేపట్టారు. ఓ ప్రైవేట్ స్కూల్ కాంప్లెక్తో పాటు మరో భారీ నిర్మాణం ఎఫ్టీఎల్ను ఆనుకొని బఫర్ జోన్లో ఉండడం గమనార్హం.
హద్దులు వేసేందుకు సిద్ధమై.. వెనుతిరిగిన వైనం
లక్షెట్టిపేట చెరువు, ఇటిక్యాల చెరువు ఈ రెండూ కలిసే ఉంటాయి. ఇటీవల కొందరు రియల్టర్లు అక్రమంగా మొరం పోస్తున్నారన్న సమాచారం మేరక రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్, పోలీస్ అధికారులు వచ్చి అడ్డుకున్నారు. చెరువుకు ఎఫ్టీఎల్ హద్దులు వేయాలని నిర్ణయం తీసుకుని స్ట్రెంచ్ (కంచె వేయడం) వేసేందుకు సిద్ధం అయ్యారు. స్ట్రెంచ్ వేసేందుకు జేసీబీనీ తెప్పించారు.
ఉన్నతాధికారుల నుంచి ఫోన్ రావడంతో పనులు ఆపేశారు. తిరిగి వారం రోజులయ్యాక వచ్చి మరోసారి స్ట్రెంచ్ వేసేందుకు సిద్ధమయ్యారు. గతంలో పోసిన మొరంను మున్సిపల్ సిబ్బంది సమక్షంలో తొలగించేందుకు ప్రయత్నించగా, ఈ సారి కలెక్టర్ నుంచి ఫోన్ రావడంతో మొరం తరలింపు, స్ట్రెంచ్ వేసే పనులను మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారు.
హైకోర్టును ఆశ్రయించిన పట్టాదారులు..
ఆరేళ్లక్రితం ఇక్కడున్న ఒక్కరిద్దరి పట్టాదారులు తమకున్న భూమిని సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఇట్టి భూమిలోకి ఎవరైనా రావాలన్నా, నిర్మాణాలు తొలిగించాలన్నా, ఇంకేం చేయాలన్నా నోటీసులు జారీ చేసి, కొంత సమయం ఇచ్చాక రావాలని హైకోర్టు ఆదేశించడంతో ఎవరూ ఈ చెరువుల వైపు చూడలేదు. ఈ క్రమంలో గత 20 రోజులుగా చెరువులకు ఎఫ్టీఎల్ హద్దులు వేయాలని, బఫర్ జోన్ నిర్ణయించాలని అధికారులు చెబుతూ వస్తున్నారు.
దీంతో బఫర్ జోన్లో ప్లాట్లు ఏర్పాటు చేసిన రియల్టర్లు, నిర్మాణాలు చేసుకున్న పట్టాదారులకు ఏం చేయాలలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రెండుసార్లు అధికారులను అడ్డుకున్నప్పటికీ ఈ సారి దసరా పండుగ అయిపోగానే అధికారులు పట్టాదారులకు నోటీసులు ఇచ్చి ఎఫ్టీఎల్ హద్దులు నిర్ణయించి ఆ మేరకు స్ట్రెంచ్ వేయడం పక్కా అని తెలిసింది. దీంతో ఏం చేయాలో తోచక రియల్టర్లు తలలు పట్టుకుంటున్నారు.
నోటీసులు ఇచ్చాకే స్ట్రెంచ్ వేస్తాం
ఇటిక్యాల-లక్షెట్టిపేట చెరువులు కలిపి సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉంటాయి. ఈ చెరువుల చుట్టూ సుమారు 37 సర్వే నంబర్లు ఉన్నాయి. అట్టి సర్వే నంబర్లలో ఉన్న పట్టాదారులందరికీ నోటీసులు ఇచ్చాకే ఎఫ్టీఎల్ హద్దులు వేయడం, స్ట్రెంచ్ వేయడం జరుగుతుంది. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ సమన్వయంతోనే కలెక్టర్ ఆదేశాల మేరకు చెరువు చుట్టూ ఉన్న 302 నుంచి 318 సర్వే నంబర్లు, 330 నుంచి 340 వరకు (ఇందులో రెండు సర్వే నంబర్లు మినహా), అదే విధంగా 295, 296, 5,7,8,9,10,11, 20,24,25,26,27 సర్వే నెంబర్లకు నోటీసులు జారీ చేస్తాం.
– కుమార్, ఇరిగేషన్ శాఖ డీఈఈ