ఖానాపూర్ టౌన్, జూలై 12 : బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి, ప్రముఖ విద్యావేత్త భూక్య జాన్సన్ నాయక్ ప్రస్తుతం ఏ పదవిలో లేకున్నా అంకితభావంతో చేస్తున్న పనితీరు నేటి సమాజానికి ఆదర్శనీయంగా నిలుస్తోందని బోథ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మి కొనియాడారు. శనివారం జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో ఖానాపూర్ పట్టణంలోని ఏఎంకే ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాబ్‌మేళాకు తరలివచ్చిన నిరుద్యోగ యువతను ఉద్దేశించి మాట్లాడారు. యువత ఉపాధి సాధనలో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రాష్ట్ర చరిత్రలో 60కి పైగా ప్రఖ్యాత కంపెనీలను ఒకే వేదికపై చేర్చి నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించడం ఆదర్శనీయంగా నిలుస్తుందన్నారు. స్వచ్ఛందంగా, రాజకీయాలకు అతీతంగా ఇటువంటి మెగా జాబ్‌మేళా నిర్వహించడం వెనుక జాన్సన్ నాయక్ శ్రమ ఎనలేనిదన్నారు. జాబ్‌మేళాకు ఆరు వేలకు పైగా నిరుద్యోగ యువత తరలిరావడంతో ఖానాపూర్ బస్టాండ్ నుంచి ఏఎంకే ఫంక్షన్ హాల్ ప్రాంగణం వరకు ఎటు చూసిన కిక్కిరిసిన జనం దర్శనమిచ్చారు.
జాబ్‌మేళాకు హాజరై ఆరు వేలకు పైగా యువతకు జాన్సన్ నాయక్ భోజన వసతి కల్పించారు. అంతకు ముందు ముఖ్య అతిథులుగా హాజరైన బోథ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మి, ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, నిర్మల్ ఎఫ్ఏసీఎస్ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి తదితర బీఆర్ఎస్ జిల్లా నాయకులకు జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జాన్సన్ నాయక్ నివాసం నుంచి జాబ్ మేళా నిర్వహణ స్థలం వరకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి.
మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి ఎమ్మెల్యేలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత మూడు వేల మంది నిరుద్యోగ యువత హాజరవుతారని భావించినప్పటికి శుక్రవారం అర్ధరాత్రి వరకు ఎన్రోల్మెంట్స్ భారీగా పెరిగి ఐదు వేలకుపైగా చేరుకోవడంతో ఆరు వేల మందికి సరిపడా సౌకర్యాలను సమకూర్చడంలో జాన్సన్ నాయక్ తలమునకలయ్యారు. సూమారు 60కి పైగా కంపెనీల ప్రతినిధులకు ఒక్కరోజు ముందుగానే వసతి సౌకర్యాలను కల్పించారు. మొత్తానికి జాన్సన్ నాయక్ ప్రత్యేక చొరవతో చేపట్టిన మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభించడం ఖానాపూర్ నియోజకవర్గంతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హాట్ టాఫిక్‌గా మారింది.
యేటా జూలైలో జాబ్‌మేళా నిర్వహిస్తా.. భూక్య జాన్సన్ నాయక్, బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి.
ఖానాపూర్ నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ సమస్యకు తనవంతు పరిష్కారం చూపడంలో భాగంగా నిర్వహించిన మెగా జాబ్‌మేళాను యేటా జూలై మాసంలో నిరంతరయంగా నిర్వహిస్తానని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్య జాన్సన్ నాయక్ అన్నారు. నిరుద్యోగ యువత వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అవకాశం దక్కనివారు నిరుత్సహపడవద్దని, తిరిగి ఉపాధి సాధనకు కృషి చేయాలన్నారు. ఈ మెగా జాబ్‌మేళాలో రాష్ట్రంలో ప్రఖ్యాత కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. 60కి పైగా కంపెనీలు హాజరై దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు చేశారన్నారు.
వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 5216 మందికిపైగా నిరుద్యోగులు తరలివచ్చారు. వీరందరికీ వసతులు, భోజనం కల్పించామన్నారు. జాబ్ మేళా ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి 860 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారని తెలిపారు. ఇంకా 310 మందికి అయా కంపెనీల ఆధ్వర్యంలో నియామకపత్రాలు ఇవ్వనున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రామునాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు సక్కారం శ్రీనివాస్, కల్వకుంట్ల నారాయణ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కరిపే శ్రీనివాస్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్, జిల్లా నాయకులు కొక్కుల ప్రదీప్, శనిగారపు శ్రావణ్, తోట సుమిత్, కారింగుల సుమన్, భారత్ చౌహన్, సల్ల నరేందర్‌రెడ్డి, సిరిగారపు లింగన్న, కాలేరి దివాకర్, సాడగే ప్రసాద్, కౌట మహేశ్, ఖాన్, కొక్కుల శేఖర్, నసీర్, ఇర్ఫాన్ పాల్గొన్నారు.
మెగా జాబ్ మేళా ద్వారా అయా కంపెనీలలో ఉద్యోగాలు పొందిన 170 మందికి వెంటనే జాన్సన్ నాయక్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. మరో 500 మందికి అయా కంపెనీలు వారి నైపుణ్యాన్ని బట్టి నియామక పత్రాలు అందజేస్తాయని తెలిపారు.