మంచిర్యాల, మార్చి 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చిన రోజులు పోయాయి. అన్ని గంటలు కరెంట్ అవసరం లేదంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ను రద్దు చేసింది కాంగ్రెస్ సర్కారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 16 గంటల కరెంట్ చాలని చెప్పుకొచ్చింది. కానీ.. క్షేత్రస్థాయిలో ఆ 16 గంటల కరెంట్ కూడా అందడం లేదు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో 16 గంటలకు బదులు 10 గంటల నుంచి 14 గంటలే వ్యవసాయానికి ఇస్తున్నారు.
మంచిర్యాల జిల్లా కోటపల్లిలో శనివారం రాత్రి 12 గంటలకు రావాల్సిన కరెంట్ ఉదయం 3 గంటలకు వచ్చింది. ఆ వచ్చిన కరెంట్‌లో ఉదయాన్నే మరో గంట కోత పెట్టారు. అడిగితే ప్యూజు ఆగడం లేదంటూ అధికారులు సెలవిచ్చారు. ఇలా ఈ ఒక్క దగ్గరనే కాదు చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. కరెంట్ ఇప్పుడు వస్తదో, ఎప్పుడు పోతదో తెల్వక పొలాల్లోనే రైతులు కావలి కాయాల్సి వస్తున్నది. ఇచ్చే కరెంట్‌తో పొలాలకు సరిపడా నీళ్లు అందించలేక అవస్థలు పడుతున్నామంటూ రైతులు వాపోతున్నారు. కరెంట్ లైన్ల రిపేర్లు, ప్యూజుల సమస్యలు, ఫీడర్ ప్రాబల్స్ అని రోజుకో కారణం చెప్పి ఇచ్చే కొద్దిపాటి కరెంట్‌లో రెండు, మూడు గంటలు కోతలు పెడుతున్నారని చెప్పుకొస్తున్నారు.
మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాలతోపాటు జిల్లాలోని ఇతర ప్రధాన పట్టణాలు, గ్రామాల్లో అప్రకటిత కరెంట్ కోతలతో జనాలు అవస్థలు పడుతున్నారు. మెయింటెనెన్స్ పనులు, ట్రీ కటింగ్ల పేరిట వారాంతాలు శని, ఆదివారాల్లో గంటల కొద్దీ కోతలు పెడుతున్నారు. ఒక్కో వారం ఒక్కో ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని కరెంట్ సరఫరాను నిలిపి వేస్తున్నారు. ఇక ప్రధాన పట్టణాల్లో సాయంత్రం ఐదు గంటలు దాటితే ఎప్పుడు కరెంట్ పోయేది తెల్వడం లేదు.
ఫిర్యాదులు వచ్చాయి తీగలు సరిచేస్తున్నాం, చెట్టు కొడుతున్నామంటూ కోతలు పెడుతున్నారు. దీంతో 24 గంటల కరెంట్ అన్నది కలగానే మిగిలింది. నెలలో నాలుగైదు రోజులు తప్ప 24 గంటలు కరెంట్ ఉన్న సందర్భాలు చాలా తక్కువని గృహ వినియోగదారులే చెప్తున్నారు. టౌన్ కేంద్రాల్లో ఇలా అప్రకటిత కోతల కారణంగా చేతి వృత్తులు, చిరు పరిశ్రమలు వెల్డింగ్ షాపులు, ఇస్త్రీ షాపులు, ఎలక్ట్రానిక్ షాపులు, మోటార్ రిపేరింగ్ సెంటర్ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. వారంలో రెండు రోజులు గంటల కొద్ది కరెంట్ తీసివేస్తుండడంతో వ్యాపారాలు సజావుగా చేసుకోలేకపోతున్నామని వాపోతున్నారు.

Adilabad
రోజుకు పది సార్లు కరెంటు పోతున్నది..
మా గ్రామంలో రైతులు యాసంగిలో జొన్న సాగు చేస్తారు. ప్రభుత్వం వ్యవసాయానికి అవసరమైన కరెంటు ఇస్తున్నామని చెబుతున్నా.. సరఫరాలో తీవ్ర అంతరాయం కలుగుతున్నది. దీంతో రైతులు సాగులో ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. విద్యుత్ సిబ్బందిని కరెంటు ఎందుకు పోతందని అడిగితే పైనుంచి పోతుందని సమాధానం ఇస్తున్నారు. కొన్నిసార్లు లైన్ ఫాల్ట్ అని అంటున్నారు. ఊరికే కరెంటు పోతుండడంతో పొలాల వద్ద నీరు అందించడానికి రాత్రి, పగలు కాపలా ఉండాల్సి వస్తున్నది. సరఫరా నిలిచిపోయినప్పుడల్లా స్టార్టర్ ఆన్ చేయాల్సి ఉంటుంది. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– కినుక రమణ, రైతు, అంకోలీ, ఆదిలాబాద్ రూరల్ మండలం
పంటలెండిపోతున్నయ్
దహెగాం, మార్చి 28 : పది ఎకరాల్లో వరి సాగు చేసిన. ఇప్పుడు పొలం కంకి దశలో ఉంది. అప్రకటిత కరెంట్ కోతల వల్ల ఎండిపోయే పరిస్థితి వచ్చింది. రాత్రీ పగలూ కరెంట్ కోతలు పెడుతున్నరు. రోజుల పది గంటలు కూడా సరిగా ఇవ్వడం లేదు. ఇక లోవోల్టేజీతో మోటార్లు కూడా కాలిపోతున్నయి. మాపై భారం పడుతుంది. గిట్లయితే మా బతుకులెట్లా.
– జర్పుల కృష్ణ, మర్రిపల్లి
కరెంట్ కోతలతో తిప్పలు
కాగజ్‌నగర్, మార్చి 28 : రాత్రి వేళల్లో కరెంట్ కోతలతో తిప్పలు పడుతున్నం. ఓ వైపు దోమలు, ఉక్కపోతతో కంటిమీద కునుకు లేకుండా పోతున్నది. కరెంటు ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియని దుస్థితి నెలకొంది. ముఖ్యంగా కాగజ్‌నగర్ మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో కరెంటు కోతలు తీవ్రంగా ఉండడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నం. ఇకనైనా కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి.
– పుల్ల శ్రీకాంత్, కొత్త సార్సాల