కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : గిరి రైతుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన ‘గిరి వికాసం’పై ప్రస్తుత ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఇది వరకు మంజూరు చేసిన యూనిట్లకు విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడం.. కరెంట్ మోటర్లు ఏర్పాటు చేయకపోవడంతో పథకం లక్ష్యం నీరుగారిపోతున్నది.
ఒక్కో యూనిట్‌కు రూ.3.50 లక్షలు
ఐటీడీఏ ద్వారా అమలు చేస్తున్న గిరి వికాసం పథకంపై అధికారులు పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తున్నారు. పదెకరాలకో యూనిట్ (ఐదెకరాలు కలిగిన ఇద్దరు రైతులు.. లేక అంతకంటే తక్కువ భూమి కలిగిన ముగ్గురు రైతులకు కలిపి ఒక యూనిట్)ను అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఒక్కో యూనిట్ కింద రూ. 3.50 లక్షల దాకా కేటాయించారు. ఈ పథకం ద్వారా చేలల్లో బోర్లు వేయడం.. విద్యుత్ లేన్లు ఏర్పాటు చేయడం.. విద్యుత్ మోటర్లు బిగించడం వంటివి చేయాల్సి ఉంటుంది. కానీ అధికారులు ఇవేవీ పట్టించుకోకపోవడం వల్ల యూనిట్లు మంజూరైన రైతులకు ఫలితం లేకుండా పోయింది..
కేవలం 13 యూనిట్లే..
జిల్లాలో గతంలో గిరి వికాసం పథకం కింద 169 యూనిట్ల కోసం రూ. 92 లక్షల దాకా ఖర్చుచేశారు. రైతుల చేల వద్ద 482 బోరుబావులను తవ్వించారు. విద్యుత్ లేన్ల ఏర్పాటు కోసం రూ. కోటీ 78 లక్షలు కూడా కేటాయించారు. కానీ ఆపై విద్యుత్ లేన్లు గాని, మోటర్లుగాని ఏర్పాటు చేయలేదు. ఇప్పటి వరకు మొత్తంగా 13 యూనిట్లు మాత్రమే పూర్తిస్థాయిలో అమలు చేశారు. మిగతా వాటికి విద్యుత్ కనెక్షన్లు, మోటర్లు ఏర్పాటు చేయకపోవడంతో బోర్లన్నీ నిరుపయోగంగా మారాయి. ఓ వైపు కొన్ని నెలలుగా గిరి వికాసం పథకానికి నిధులు కేటాయించకపోవడం.. మరోవైపు అటవీ ప్రాంతంలో ఉండే వ్యవసాయ భూములకు విద్యుత్లేన్లు వేసేందుకు అటవీశాఖ ఆంక్షలు విధించడం అడవిబిడ్డలకు శాపంగా మారింది.