మేము రైతు నేస్తాలం. కరెంటు షాక్కు బలైన మూగజీవాలం. మా వంటి చావు ఏ జీవికి రావొద్దని ఆత్మఘోష వినిపిస్తున్నం.. మాది, మా యజమాని నిర్మల్ జిల్లా కడెం మండలంలోని చిన్న బెల్లాల్(నర్సింగాపూర్)కు చెందిన బొడ్డు సత్తన్నది మా చిన్నప్పటి నుంచి విడదీయలేని బంధం. మేము ఒకే తల్లికి పుట్టిన ఆవులం. దాదాపు ఐదేండ్ల సంది మా యజమాని ఇంట్ల ఉంటున్నం. మేము, మా యజమానికి అండగా నిలిచినం. రోజు దాదాపు 8 లీటర్ల పాలిస్తున్నం. ఇవి అమ్మగా రూ.500లకుపైగా డబ్బులు వస్తున్నాయి.
మా యజమాని కుటుంబానికి ఆర్థికంగా సాయపడుతున్నం. అట్లనే మమ్మల్సి కూడా మా యజమాని, ఆయన కుటుంబ సభ్యులు వారి పిల్లల మాదిరిగా చూసుకుంటున్నరు. సాఫీగా సాగుతున్న మా జీవితాన్ని కరెంటు కాటేసింది. బుధవారం మధ్యాహ్నం మా యజమాని రోజు మాదిరిగానే మేతకు మమ్మల్ని వదిలిండు. మేసుకుంటూ ఊరి చివరన్న ఉన్న కరెంటు ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లినం. అక్కడ విద్యుత్ వైరు తగిలింది. కరెంటు షాక్తో విలవిల్లాడినం. కొన ఊపిరితో కొట్టుమిట్టాడినం. విద్యుత్ షాక్కు గురై ప్రాణాలు విడిచినం. అక్కాచెల్లెళ్ల లెక్క ఉన్న మేము ఒక్కచోటే శ్వాస వదిలినం.
ఆ దేవుడు మమ్మల్ని సత్తన్న ఇంటి వద్ద కలిపి ఊరి చివర ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద శ్వాస వదిలించాడు. చివరకు మమ్మల్నే సర్వస్వం అనుకున్న మా యజమానిని విడిచి వెళ్లిపోయినం. ఇక్కడ నాదొక్కటే ప్రశ్న. మేము చేయని తప్పుకు బలి చేయడం ఎంతవరకు న్యాయం? అసలు మా చావుకు బాధ్యులెవరు? విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి మాలాగా ఎన్నో మూగజీవాలు బలికావాల్సిందేనా? ఇకనైనా కండ్లు తెరవండి. మరే ప్రాణి చనిపోకుండా చర్యలు తీసుకోండి. మా చావు కరెంటోళ్లను ఆలోచింపజేస్తుందని భావిస్తున్నం. అదే జరిగితే.. కనీసం తోటి మూగజీవాలు మృత్యువాత పడకుండా ఉంటాయి. తద్వారా మా ఆత్మ సంతృప్తి చెందుతుంది. వచ్చేది వర్షాకాలం. కరెంటు తీగలు తెగిపోయి, తుప్పు పట్టిన స్తంభాలు విరిగిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడే మరమ్మతు చేపట్టి మరే మూగజీవి మాలాగా చనిపోకుండా చూస్తారని ఆశిస్తున్నం..
– కడెం, జూన్ 3