కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : తిర్యాణి మండల కేంద్రం సమీపంలోని చెలిమెల (ఎన్టీఆర్ సాగర్) ప్రాజెక్టు కాలువలు పిచ్చిమొక్కలతో నిండి నీరందించలేని దుస్థితి నెలకొనగా, రైతాంగం యాసంగిపై ఆశలు వదులుకుంటున్నది. ప్రాజెక్టు, కాలువల నిర్వహణ సరిగా లేక పంటలు నష్టపోవాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నది. ఇకనైనా సర్కారు సకాలంలో స్పందించి సాగు నీరందించాలని వేడుకుంటున్నది.
ఈసారి 80 ఎకరాలే..
ప్రాజెక్టు కింద యేటా యాసంగిలో దాదాపు 200 ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా, ఈ యాసంగిలో మాత్రం 80 ఎకరాలే వేశారు. ప్రస్తుత ప్రభుత్వ పట్టింపులేని తనంతో ఆ 80 ఎకరాలకు కూడా నీరందించలేని పరిస్థితి ఉన్నది. కనీసం మోటర్ల ద్వారనైనా పంటలు కాపాడుకుందామంటే కరెంటు సరిగా ఉండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ సర్కారులో..
చెలిమెల వాగుపై 1985లో అప్పటి సర్కారు రూ. 120 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. తిర్యాణితో పాటు పలు గ్రామాల పరిధిలో సుమారు 6 వేల ఎకరాలకు సాగునీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 1998 వరకు ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసిన అధికారులు ప్రధాన కాలువలను మాత్రం వదిలేశారు. ప్రాజెక్టులో నీరున్నా పంటలకు అందని పరిస్థితి. ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చి.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చెలిమెల వాగు ప్రాజెక్టును పునరుద్ధరించి.. కాలువల నిర్మాణానికి నిధులు కేటాయించారు. పనులు పూర్తి చేయించారు. గత సర్కారులో రెండు పంటలకు సరిపడా నీరందించగా, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు పుణ్యమాని పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి చెలిమెల ప్రాజెక్టు కాలువలను ఉపయోగంలోకి తెచ్చి తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.