ఆదిలాబాద్, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ప్రహసనంగా మారింది. ఎన్నికల వేళ ఎకరాకు రూ.7,500 ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని నిలబెట్టుకోవడంలో విఫలమైంది. తీరా ఎకరాకు రూ.6 వేలు ఇస్తామని ప్రకటించి పంపిణీ ప్రక్రియను ప్రహసనంగా చేపట్టింది. ఆదిలాబాద్ జిల్లాలో యాసంగి ముగిసినా డబ్బులు జమ కాలేదు. కేవలం నాలుగెకరాలు ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం పైసలు రాగా.. మిగతా వారు తమకు సాయం ఎప్పుడు అందుతుందో అని ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతుబంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేసింది. రైతులకు సీజన్‌కు ముందుగానే ఎకరాకు రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందజేసింది. దీంతో రైతులు రెండు సీజన్లలో తమకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి ఇబ్బందులు లేకుండా సాగు చేసి లాభాలు పొందారు.
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1,63,359 మంది రైతులు ఉన్నారు. యాసంగిలో జొన్న, గోధుమ, వరి, కంది, పల్లి, ఇతర పంటలు సాగు చేస్తారు. సాగులో భాగంగా పెట్టుబడుల కోసం బ్యాంకులు, ప్రైవేటు అప్పులు చేస్తారు. ఈ సీజన్లో రైతులు పండించిన పంటలు చేతికి రాగా కొన్ని పంటల అమ్మకాలు పూర్తయ్యాయి. పంటలు విక్రయానికి రాకపోవడంతో మార్కెట్ యార్డుల్లో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో శనివారంతో శనగ, కంది కొనుగోళ్లు నిలిపివేశారు. జొన్న పంట తీసిన రైతులు ప్రభుత్వ కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ పెద్దల ప్రకటనల మేరకు రైతు భరోసా వస్తుందనే నమ్మకంతో అప్పులు తీసుకొచ్చి సాగు చేశామని, సీజన్ ముగియడంతో అప్పులు ఇచ్చిన వారు తమ పైసలు వడ్డీ ఇవ్వాలని అడుగుతున్నారని రైతులు అంటున్నారు. జొన్న కొనుగోళ్లు లేక, రైతు భరోసా రాక అప్పులు ఎలా కట్టాలో తెలియడం లేదంటున్నారు. ప్రభుత్వం రైతు భరోసా పథకం డబ్బులు పంపిణీ చేయాలని కోరుతున్నారు.
తలమడుగు, ఏప్రిల్ 12 : మార్చి 31వ తేదీ వరకు ఐదెకరాల లోపు ఉన్న రైతులకు రైతు భరోసా ఇస్తానని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవలే ప్రకటన చేశారు. మరోసారి రైతులను మోసం చేసిండ్రు. నాకు తలమడుగు శివారులో ఐదెకరాల భూమి ఉంది. నాకు రైతు భరోసా రాలేదు. ఖరీఫ్, రబీ సీజన్లకు పెట్టుబడి అందలేదు. రుణమాఫీ చేయక, రైతు భరోసా ఇయ్యక కాంగ్రెస్ రైతులను రోడ్డు మీదికి తీసుకొచ్చింది. అప్పుల బాధతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలాంటి పాలనను ఎప్పుడు చూడలేదు.
– బద్దం నవీన్‌రెడ్డి, రైతు, తలమడుగు.
నాకు గుబిడి శివారులో ఐదెకరాల భూమి ఉన్న ది. కాంగ్రెస్ సర్కారు రైతు భరోసా డబ్బులు నాలుగె కరాల వరకు ఇచ్చిందంటే సంబరు పడ్డ. ఐదెకరాలున్న నాకు కూడా వస్తదని అనుకున్న. కానీ.. ఇంతవరకు డబ్బులు రాలేదు. ఇప్పటికే వర్షాలు ఎక్కువై వరదలతో పంటలు నష్టపోయినం. రైతు భరోసా రాక బాధ పెరిగింది. కేసీఆర్ సారు రైతుబంధు అందరికీ ఆలస్యం లేకుంటా చెప్పిన సమయంల ఇస్తుండె. ఇప్పుడీ సర్కారుకు ఏమైందో అర్థం కాకుండా ఉన్నది. ఇప్పటికైనా సర్కారు రైతులను పట్టించుకోవాలా. అందరికీ రైతు భరోసా డబ్బులు ఇవ్వాలే.
– గడ్డం రవీందర్‌రెడ్డి, రైతు, గుబిడి, భీంపూర్ మండలం
తలమడుగు, ఏప్రిల్ 12 : నాకు కజ్జర్ల శివారంలో మూడెకరాల భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి రైతు భరోసా ఇప్పటివరకు రాలేదు. రైతు భరోసా ఇయ్యక కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. గత కేసీఆర్ ప్రభుత్వం సమయానికి రైతుబంధు ఇచ్చి రైతులను ఆదుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అయినా రైతు భరోసా ఇవ్వడం లేదు. ఇప్పటికైనా రైతు భరోసా రైతుల ఖాతాల్లో జమ చేయాలి. రూ.2 లక్షల రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలి.
– చింతరపెల్లి మోహన్ రెడ్డి, కజ్జర్ల, తలమడుగు.