కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 13(నమస్తే తెలంగాణ) : వాంకిడి బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో దాదాపు 64 మందికిపైగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ప్రత్యేకంగా వేసిన కమిటీతో దాదాపు పక్షం రోజులుగా అధికారులు విచారణ జరిపారు. చివరకు ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌తోపాటు ఏఎన్ఎం సేవంత, కుక్ హరిసింగ్, ఇద్దరు వర్కర్లు కమల, పెంటయ్యలను ఇతర ఆశ్రమ పాఠశాలకు బదిలీ చేశారు. ఈ మేరకు ఐటీడీఏ పీవో బదిలీ చేసినట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రమాదేవి తెలిపారు. దీంతో ఘటనపై లోతైన విచారణ జరపలేదనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. పాఠశాలకు సరఫరా అవుతున్న సరుకులు నాణ్యమైనవేనా? ఆహారం విషయంలో వార్డెన్ చేస్తున్న నిర్లక్ష్యంపై అధికారులు స్పందించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం హెచ్ఎం, ఏఎన్ఎం, ముగ్గురు వంట మనుషులపై బదిలీ చర్యలు చేపట్టి ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారే విమర్శలు వస్తున్నాయి.
గాడి తప్పుతున్న ఆశ్రమ పాఠశాల
గిరిజన విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించే ఐటీడీఏ ఆశ్రమ పాఠశాల గాడి తప్పుతోంది. పర్యవేక్షణ ప్రశ్నార్థకంగా మారడంతో ఆహారం, చదువులతోపాటు వారి సంక్షేమంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. వాంకిడి మండల కేంద్రంలోని బాలిక ఆశ్రమ పాఠశాలలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇక మారుమూల గ్రామాల్లోని ఆశ్రమాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో 46 ఆశ్రమ పాఠశాలల్లో దాదాపు 12 వేల మంది గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఆశ్రమాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆశ్రమ నిర్వాహకులు విద్యార్థులపై శ్రద్ధ తీసుకునేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.