నిర్మల్, మే 13(నమస్తే తెలంగాణ) : కొత్త కనెక్షన్ నుంచి ఫిర్యాదుల స్వీకరణ వరకు స్మార్ట్‌ఫోన్ ద్వారా పొందేలా టీజీఎన్పీడీసీఎల్ యాప్‌ను రూపొందించింది. మొదట 2024లో ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ యాప్ ద్వారా సేవలు పరిమితం కావడం, తరచూ బిల్లుల చె ల్లింపులపై ఆంక్షలు విధిస్తుండడంతో వినియోగదారులు యా ప్ను పెద్దగా వినియోగించలేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి దాదాపు 20 రకాల సేవల ద్వారా అందుబాటులోకి తెచ్చారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీజీఎన్పీడీసీఎల్ యాప్ అని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యూఎస్ సీ(యూనిక్ నంబర్ ఇన్ ఎలక్ట్రిసిటీ సర్వీస్) నంబరు నమోదు చేస్తే యాప్ అందుబాటులోకి వస్తుంది. ఈ యాప్‌ను చాలా మంది డౌన్ లోడ్ చేసుకుని సేవలను పొందుతున్నారు.
గృహ అవసరాలతోపాటు, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. టీజీఎన్పీడీసీఎల్ యాప్ ద్వారా విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన పత్రాలను యాప్‌లోనే లోడ్ చేసిన తర్వాత అధికారులు పరిశీలించి విద్యుత్ కనెక్షన్ ఇస్తారు. అలాగే రైతులు కూడా ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులకు విద్యుత్ అధికారులు అందించే సేవలపై వారి ఫోన్ నంబర్‌కు మెసేజ్ వస్తుంది. విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తినా, విద్యుత్ చౌర్యం జరిగిట్లు సమాచారం ఉంటే యాప్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంది. వీటితోపాటు విద్యుత్ చార్జీల టారీఫ్ వివరాలు, భద్రత సూచనలను సులభంగా పొందేలా ఆధునికీకరించారు. సంస్థ పరిధిలో ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా వినియోగదారులు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ యాప్‌తోపాటు వెబ్సైట్లలోనూ ఆన్లైన్ సేవలను సులభంగా పొందవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
విద్యుత్ వినియోగదారులు ఈ యాప్ ద్వారా తమ సమస్యలను నేరుగా తెలియజేయవచ్చు. విద్యుత్ మీటరు నంబరుతోపాటు సమస్యల వివరాలను నమోదు చేస్తే అధికారులు పరిష్కరిస్తారు. ఫిర్యాదు చేసిన తర్వాత ప్రస్తుతం దాని స్టేటస్ ఏమిటన్నది తెలుసుకోవచ్చు. సమస్య పరిష్కారం విషయంలో సంతృప్తి చెందకపోతే తిరిగి మళ్లీ ఫిర్యాదు చేయవచ్చు. ఈ యాప్‌లో ముఖ్యంగా వినియోగదారులు తమ విద్యుత్ వినియోగంపై మీటరు ద్వారా సెల్ఫ్ రీడింగ్ తీసుకుని పంపవచ్చు. దీని ప్రకారం బిల్లులు జారీ అవుతాయి. అలాగే సర్వీస్ నంబర్ నమోదు చేసుకుని ప్రతినెలా తమ విద్యుత్ బిల్లులను ఇందులోనే చెల్లించవచ్చు. అలాగే తాము ఇప్పటి వరకు చెల్లించిన బిల్లుల వివరాలను తెలుసుకునే వీలుంటుంది. వినియోగదారులు తమ విద్యుత్ సర్వీసుకు ఆధార్, మొబైల్ నంబరును లింక్ చేసుకోవచ్చు. దీనిద్వారా ప్రతినెలా బిల్లులకు సంబంధించిన సమాచారం మెస్సేజ్ వస్తుంది. ఇలాంటి సేవలతోపాటు విద్యుత్ వినియోగంపై సందేహాలు ఉంటే సమాచారాన్ని పొందవచ్చు. విద్యుత్ కనెక్షన్ కావాలనుకునే వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి. అప్పటికే ఉన్న కనెక్షన్‌కు సంబంధించి పేరు మార్పిడి ఏ విధంగా చేసుకోవాలి, విద్యుత్ లోడ్ వివరాలు ఉంటాయి. వీటితోపాటు టారిఫ్ వివరాలు, కరెంటును ఆదా చేసే చిట్కాలు, సేఫ్టీ టిప్స్ ఉన్నాయి.
టీజీఎన్పీడీసీఎల్ యాప్ ద్వారా విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను సత్వరమే పరిష్కరించుకోవచ్చు. అలాగే సంస్థ అందించే సేవలను వేగంగా పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్తగా తీసుకునే డొమెస్టిక్, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తమ సమయాన్ని వృథా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ యాప్‌లో వివరాలను నమోదు చేసి కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అన్నీ సక్రమంగా ఉంటే 24 గంటల్లో కనెక్షన్ మంజూరవుతుంది. యాప్‌లో సూచించిన అడ్రస్‌కు మా సిబ్బంది వచ్చి కనెక్షన్ ఇస్తారు. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా, పూర్తి పారదర్శకంగా విద్యుత్ సేవలను అందించేందుకు ఈ యాప్‌ను సంస్థ అందుబాటులోకి తెచ్చింది.
– సుదర్శనం, ఎస్ఈ, ఎన్పీడీసీఎల్