కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ మండలం చాత గ్రామానికి చెందిన ఏషాల లక్ష్మి- విఠల్ దంపతుల కూతురు ఏషాల సాహిత్య ( Sahitya ) కు నగదు పురస్కారంతో పాటు ప్రశంసాపత్రాన్ని (Appreciation) అందజేశారు. నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్ ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో చదివిన సాహిత్య పదో తరగతిలో ( Tenth ranker ) 587 మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచారు.
జిల్లా కేంద్రం నిర్మల్లో జరిగిన స్వాతంత్ర వేడుకల్లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, జిల్లా ఎస్పీ జానకి షర్మిల రూ. 10వేల నగదు, ప్రశంసా పత్రం అందించి విద్యార్థిని అభినందించారు. అత్యధిక మార్కులు సాధించి జిల్లాకే వన్నెతెచ్చిన సాహిత్యను కలెక్టర్ తో పాటు రాజకీయ నాయకులు, జిల్లా అధికారులు అభినందించారు. ఉన్నత చదువుల్లో ఇదే పంథాను కొనసాగిస్తూ రాణించాలని ఆకాంక్షించారు. చాత సర్పంచ్ అనిల్ సిందే, గ్రామస్థులు సాహిత్యను సత్కరించి అభినందించారు.