మంచిర్యాల, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ పార్టీ నేటితో 26వ వసంతంలోకి అడుగుపెట్టనున్నది. 25 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో తెలంగాణ దిశదశను మార్చిన పార్టీగా బీఆర్ఎస్ చరిత్రకు ఎక్కింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కాంక్షతో పుట్టిన పార్టీ.. లక్ష్యాన్ని ముద్దాడి స్వరాష్ట్ర కలను నిజం చేయడంతో పాటు కొత్త రాష్ట్రంలో పదేండ్ల పాటు అద్భుతమైన పాలన అందించింది. ప్రపంచానికి మార్గదర్శకం చేసే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతో తెలంగాణ జనాల మదిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నది. ఉద్యమ పార్టీగా తెలంగాణ కలను సాకారం చేయడం మొదలు, కొత్త రాష్ట్రంలో సుభిక్షమైన పాలన అందించి, నేడు ప్రతిపక్షంగా ప్రజలు అప్పగించిన పాత్రను అద్భుతంగా పోషిస్తున్నది.
నేడు ఊరూరా బీఆర్ఎస్ జెండాల ఆవిష్కరణ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. సోమవారం ప్రతీ గ్రామం, పట్టణం, నియోజకవర్గం, జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండాలు ఎగురవేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇటీవల జగిత్యాలలో బహిరంగ సభ నిర్వహించడం, ఎండల తీవ్రతను దృష్ట్యా పార్టీ ప్లీనరీని హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించనున్న విషయం తెలిసింది.
కాగా, కేవలం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షుడు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లకు మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానం ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో జరిగే కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో ప్రవేశమున్న నేపథ్యంలో ఆహ్వానం ఉన్నవారే రావాలని, మిగిలిన నాయకులు, కార్యకర్తలు తమ జిల్లాలు, నియోజకవర్గాల్లోనే వేడుకలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.