ఆదిలాబాద్, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగింది. మూడు విడుతలు పంచాయతీ ఎన్నికలు జరగగా.. రెండు విడుతల్లో సత్తా చాటిన మూడో విడుతలో పూర్తి అధిక్యత ప్రదర్శించింది. ఆదిలాబాద్ జిల్లాలో 472 పంచాయతీలకు మూడు విడుతల్లో బీఆర్ఎస్ 178 పంచాయతీలను గెలుచుకొని కాంగ్రెస్, బీజేపీల కంటే ముందంజలో నిలిచింది. కాంగ్రెస్ 146 పంచాయతీలు, బీజేపీ 67, ఇండిపెండెంట్లు 81 పంచాయతీ ల్లో విజయం సాధించారు.
గిరిజన ప్రాంతాలతోపాటు ఇతర గ్రామాల్లో కూడా ప్రజలు గులా బీ పార్టీకి అండగా నిలిచారు. కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ సత్తా చాటగా, బోథ్ నియోజకవర్గంలో పూర్తి ఆధిక్యతను ప్రదర్శించింది. మూడో విడుతలో బోథ్ నియోజకవర్గంలో ఆరు మండలాల్లోని 150 పంచాయతీలకు ఎన్నికలు జరగగా సగానికి పైగా 77 పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. చిన్న గ్రామ పంచాయతీల నుంచి పెద్ద పంచాయతీల్లోనూ బీఆర్ఎస్ విజయ పరంపర కొనసాగింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక తయారు చేసి గ్రామాలను ప్రగతి వైపు నడిపించింది. కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పా టు చేసి స్థానిక నాయకులు తమ గ్రామాలను తామే అభివృద్ధి చేసుకునేలా అవకాశం కల్పించింది. గ్రామాల్లో విద్య, వైద్యం, తాగు, సాగునీరు, రవాణ సౌకర్యాలను మెరుగుపర్చడంతోపాటు రైతుబంధు రైతుబీమా, మిషన్ కాకతీయ వంటి పథకాలను అమలు చేసి అన్నదాతలకు అండగా నిలిచింది. గ్రామాల్లో పారిశుధ్యం మెరుపర్చడం, పచ్చదనం పెంపొందించడంతోపాటు పల్లెలు స్వయం సమృద్ధి సాధించేలా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేసింది.
డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, ట్రాక్టర్ల పంపిణీ, ఎరువుల తయారి, పల్లె ప్రకృతి వనాలు, పార్కులను ఏర్పాటు చేసి గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పల్లెలు అభివృద్ధికి దూరమయ్యాయి. పంచాయతీల పాలకవర్గాలు లేకపోవడంతో నిధుల కొరత సమస్యగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల ప్రగతికి చ ర్యలు తీసుకోలేదు. దీంతో ప్రజలు మరోసారి బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులకు అండగా నిలిచి పంచాయతీ ఎన్నికల్లో గులాబీ పార్టీ మద్దతుదారులకు ఓట్లు వేసి గెలిపించారు.
బీఆర్ఎస్ 178
కాంగ్రెస్ 146
బీజేపీ 67
స్వతంత్రులు 81