ఆదిలాబాద్, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని తర్నం వాగుపై రూ.4.50 కోట్లతో నిర్మించిన వంతెన వర్షాలకు నీటిపాలు అవుతున్నది. వానకాలం ప్రారంభమైనప్పటి నుంచి చిన్నపాటి వర్షాలకే వంతెన పైనుంచి నీరు ప్రవహిస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రవాహం తెలియక వంతెన దాటే ప్రయత్నం చేస్తున్న వాహదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. భోరజ్, జైనథ్, బేల మండలాలతోపాటు మహారాష్ట్రకు వెళ్లాల్సిన వాహనదారులు అవస్థలు పడుతున్నారు.
బేల మండలంలోని ఉపాసనాల నుంచి భోరజ్ వద్ద జాతీయ రహదారి-44ను కలిపేలా నేషనల్ హైవే అథారిటీ అధికారులు 353-బీ జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు. రూ.194 కోట్లతో 33 కిలోమీటర్ల రెండు వరుసల రహదారితోపాటు వంతెనల నిర్మాణం కొనసాగుతున్నది. ఏడాది క్రితం పనులు ప్రారంభం కాగా వచ్చే ఏడాది జూన్ నాటికి పనులు పూర్తికావాల్సి ఉంది. రోడ్డు నిర్మాణ పనులపై స్థానికులు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ముందుగా వంతెనలు నిర్మించిన తర్వాత రోడ్డు పనులు ప్రారంభించాల్సి ఉండగా.. రహదారి పనులు అయిన తర్వాత తర్నం వంతెన నిర్మాణ పనులు చేపట్టడంపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తర్నం పాత వంతెన ఒక పిల్లర్ కుంగిన ద్విచక్ర వాహనదారులు రాకపోకలు సాగించేవారని, అధికారులు వర్షాకాలం ముందు బ్రిడ్జిని కూల్చివేసి రాకపోకలు జరగకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెండేండ్ల క్రితం కురిసిన భారీ వర్షాలతో తర్నం వద్ద వంతెన కుంగిపోయింది. ఈ బ్రిడ్జిపై వాహనాలు ప్రమాదాలకు గురికాకుండా అధికారులు రాకపోకలు నిషేధించారు. అప్పుడు వాహనాల రాకపోకల కోసం రోడ్డు వంతెన కింది భాగంలో రూ.39 లక్షలతో చిన్న కల్వర్టును నిర్మించారు. గతేడాది వర్షకాలంలో కురిసిన వర్షాలతో ఈ వంతెన కొట్టుకుపోగా.. ఇటీవల రూ.4.50 కోట్లతో మరో వంతెన నిర్మించారు. భారీగా నిధులు వెచ్చించి నిర్మిస్తున్న వంతెన వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా పనులు చేపట్టాల్సి ఉండగా అధికారులు తక్కువ ఎత్తులో పైపులు వేసి నిర్మాణం చేశారు. ఫలితంగా సీజన్ ప్రారంభం నుంచి ఈ వంతెన మీదుగా నీరు ప్రవహించి రాకపోకలు నిలిచాయి.
మే 27న నీటి ప్రవాహంలో వంతెన దాటడానికి ప్రయత్నించిన జైనథ్ మండలంలోని లక్ష్మీపూర్‌కు చెందిన యువకుడు కొట్టుకుపోయాడు. ఇటీవల రెండు లారీలు నీటిలో మునిగిపోగా, తరచూ ప్రమాదాలు జరుగుతున్నారు. పనుల నాణ్యతా లోపం కారణంగా వంతెనకు ఇరువైపులా బీటీ రోడ్డు పాడైపోయి గుంతలమయంగా మారింది. భారీ వ్యయంతో నిర్మించిన బ్రిడ్జిపై చిన్నపాటి వర్షాలకే నీరు ప్రవహిస్తున్నదని, అధికారులు ప్రణాళికలు లేకుండా నామమాత్రంగా వంతెన నిర్మించడం వల్ల ఉపయోగం లేదని రూ.4.50 కోట్లు వృథా అయ్యాయని ప్రజలు అంటున్నారు.
గతంలో కొందరు నాయకులు ఈ వంతెనపై రాజకీయం చేశారు. అధికారులు ముందస్తు ప్రణాళికలు లేకుండా నిర్మాణ పనులు చేపట్టారు. రూ.4.50 కోట్లతో నిర్మించిన వంతెన వల్ల వాహనదారులకు ప్రయోజనం లేకపోయింది. వానకాలం ప్రారంభం నుంచి చిన్నపాటి వర్షాలకే బ్రిడ్జి పైనుంచి నీరు ప్రవహిస్తున్నది. దీంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వర్షాలకు నీరాల వద్ద వాగు పొంగడంతో భోరజ్, జైనథ్, బేల మండలాల ప్రజలకు ఆదిలాబాద్ వచ్చే దారిలేకుండా పోతున్నది. రోజు వందలాది వాహనాలు రాకపోకలు సాగించే వంతెన నిర్మాణ పనులపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
– వేణుగోపాల్ యాదవ్, స్థానికుడు
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని మామిడిగూడ(జీ) గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజన మహిళలు అతికష్టం మీద వాగు దాటి చంటి పాపకు వైద్యం అందించారు. మామిడిగూడ(జీ) గ్రామానికి చెందిన పెందూర్ ఈశ్వరి బిడ్డకు జ్వరం వచ్చింది. గురువారం వైద్యం కోసం మామిడిగూడ వాగును దాటారు. దాదాపు కిలో మీటరు దూరం కాలినడక వచ్చి ఆంధ్ మామిడిగూడ చేరుకున్నారు. అక్కడి నుంచి మండల కేంద్రానికి ఆటోలో వచ్చి వైద్యం చేయించారు. అధికారులు దృష్టి సారించి బ్రిడ్జి నిర్మించాలని ఆదివాసీ గిరిజనులు కోరుతున్నారు.
– ఇంద్రవెల్లి, సెప్టెంబర్ 4
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తనపల్లి గ్రామ రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. గురువారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి 450 బ్యాగుల లారీ లోడు రావడంతో ఉదయం నాలుగు గంటలకే పీఏసీఎస్‌కు చేరుకున్నారు. ఒక్క ఎకరానికి ఒక బ్యాగు చొప్పున 450 బ్యాగులను 200 మంది రైతులకు అందజేశారు. ఇంకా 100 మందికి పైగా రైతులకు యూరియా దొరుకక పోవడంతో నిరాశతో ఇంటికి వెళ్లారు.
– ఖానాపూర్ రూరల్, సెప్టెంబర్ 4