మత్స్యకార కుటుంబాల్లో వెలుగులు నింపడమే ధ్యేయంగా రాష్ట్ర సర్కారు ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో ఉచితంగా చేప పిల్లలను పెంచుతూ వారి భవిష్యత్‌కు భరోసానిస్తున్నది. ఇప్పటికే అనేక మత్స్య సహకార సంఘాలు ఏర్పాటు చేసి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా, తాజాగా మరిన్ని సంఘాలకూ అవకాశం కల్పిస్తున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొత్తగా 42 సంఘాల కోసం కసరత్తు చేస్తుండగా, ఏప్రిల్ 15వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు ఇచ్చింది. కనీస సామర్థ్యాల పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికే సభ్యత్వం అందిస్తామంటూ సంబంధిత శాఖ చెబుతున్నది.
సారంగాపూర్, ఫిబ్రవరి 14 : మత్స్యకారుల బలోపేతానికి ప్రభుత్వం చేయూతనిస్తున్నది. చేపలు పట్టి ఉపాధి పొందే వారి కోసం అనేక పథకాలు అమలు చేస్తూ బాసటగా నిలుస్తున్నది. చెరువులు, రిజర్వాయర్లలో ఉచితంగా చేప పిల్లలు వదలడంతో పాటు మార్కెటింగ్ కోసం రుణాలు కూడా మంజూరు చేస్తున్నది. ప్రభుత్వ పథకాలలో లబ్ధిపొందాలంటే మత్స్య సహకార సంఘాల్లో సభ్యత్వం తప్పని సరి. ఆయా సంఘాల్లో సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే అవకాశం దక్కుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సంఘాల్లో కొత్తగా సభ్యత్వం పొందేందుకు అవకాశం కల్పిస్తున్నది. సంబంధిత శాఖ అధికారులు కనీస సామర్థ్యాల పరీక్ష నిర్వహించి సభ్యత్వం ఇస్తున్నారు.
ఏప్రిల్ 15లోగా దరఖాస్తులకు అవకాశం
గతంలో సొసైటీల్లో సభ్యులుగా ఉన్న వారికి మాత్రమే చెరువుల్లో చేపలు పట్టుకొనే అవకాశం ఉండేది. అయితే మిగిలిపోయిన వారికి అవకాశం లేకుండా ఉండేది. అయితే అందరికీ ప్రయోజనం చేకూరే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నిబంధనలు సడలించింది. దీంతో సొసైటీల్లో సభ్యులుగా చేరేందుకు అవకాశం ఏర్పడింది. ఇందుకోసం ఏప్రిల్ 15వ తేదీ వరకు కొత్త సభ్యత్వాలు స్వీకరించేందుకు ప్రభుత్వం గడువునిచ్చింది.
సంఘంలో సభ్యత్వానికి ఉండాల్సిన కనీస వనరులు..
సభ్యత్వం పొందేందుకు వృత్తికి సంబంధించిన మెళకువలు తెలిసి ఉండాలి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పాత సంఘాల్లో కొత్త సభ్యు లను చేర్చుకోవడానికి అవకాశం కల్పించింది. సంఘంలో సభ్యత్వం తీసుకోవాలంటే వివిధ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
సభ్యత్వం కోసం పరీక్ష ఇలా…
సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం ఓ కమిటీ ఉండగా, కన్వీనర్‌గా జిల్లా మత్స్యశాఖ అధికారి, సంఘం జిల్లా అధ్యక్షుడు, ముగ్గురు అనుబంధ శాఖల అధికారులు ఉంటారు. పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని సభ్యుడిగా తీసుకుంటారు. ఇందులో ప్రధానంగా…
చేపలు పట్టుకోవడానికి వల విసరడంతో పాటు చేపలు జారి పోకుండా వల లాగాలి. l రిజర్వాయర్, చెరువుల లో ఈత కొట్టడం రావాలి. l ప్రభుత్వం రాయితీతో ఇచ్చే ముడిసరుకుతో వల తయారు చేయడం(అల్లడం) రావాలి. ఇది వస్తుందా లేదా అని పరీక్ష ద్వారా తెలుసుకుంటారు. ఇందులో నెగ్గకపోతే అనర్హులుగా ప్రకటిస్తారు.l చెరువులు, రిజర్వాయర్లలో తెప్పలు సరిగ్గా నడపడం రావాలి. సరిగ్గా నడి పిస్తేనే అర్హులు. l కమిటీ ఆమోదం తర్వాత ఒక్కో మత్స్యకారు డి నుంచి రూ. 55 సభ్యత్వ రుసుం తీసుకోనున్నారు.
ఉపయోగాలివే…
అర్హులు సద్వినియోగం చేసుకోవాలి
తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి ఉచితంగా చేప పిల్లలు ఇవ్వడమేగాకుండా వాటిని విక్రయించేందుకు స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నది. మోటారు సైకిళ్లతో పాటు దూర ప్రాంతాలకు రవాణా చేయడానికి నాలుగు చక్రాల వాహనాలు కూడా ఇస్తున్నది. ఎంపిక పరీక్షలు నిర్వహించిన అనంతరం కమిటీ ఆమోదం మేరకు మత్స్యకారుడి నుంచి రుసుం తీసుకొని సభ్యత్వం అందజేస్తాం. వృత్తిదారులు, ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– సత్యనారాయణ, జిల్లా మత్స్యశాఖ అధికారి, మంచిర్యాల
ప్రభుత్వ పథకాలన్నీ వర్తిస్తాయి
మత్స్య సహకార సంఘంలో సభ్యులుగా చేరితే ప్రభు త్వం ద్వారా వచ్చే పథకాలన్నీ వర్తిస్తాయి. దీంతో పాటు మత్స్య కారులకు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. మత్స్య కారులు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం సబ్సి డీ కింద చేపపిల్లలు, వలలు, తెప్పలు, మోటార్ సైకిళ్లు, ద్విచక్ర వాహనాలు కూడా సర్కారు అంది స్తుంది. 30 రకాల కులాల మత్స్యకారులు సంఘం లో చేరడానికి వీలు ఉంది.
– సాంబశివరావు, మత్స్యశాఖ అధికారి, ఆదిలాబాద్ జిల్లా