మంచిర్యాల అర్బన్, నవంబర్ 11 : బెల్లంపల్లికి చెందిన శివిని ఆమని గత నెల 15న జిల్లా కేంద్రంలోని టచ్ హాస్పిటల్లో చేరగా, వైద్యులు మూడు ఆపరేషన్లు చేయడం వల్ల ప్రాణాపాయ స్థితికి వెళ్లిన విషయం విదితమే. ప్రస్తుతం ఆమె దవాఖానలో తల్లడిల్లుతుండగా, న్యాయం చేయాల్సిన నిర్వాహకులు మాత్రం ఈ కేసు నుంచి బయటపడేందుకు తీవ్ర ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తున్నది. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో టచ్ హాస్పిటల్ నిర్వాహకులు కనిపించడం ఇందుకు బలం చేకూరుస్తున్నది.
డీఎంహెచ్‌వోను కలవడానికి వారు ప్రయత్నించగా ఆయన నిరాకరించినట్లు సమాచారం. దీంతో వారు అక్కడి నుంచి బయటకు వచ్చి ఇతర అధికారులను కలిసినట్లు తెలిసింది. ఎలాగైనా అధికారులను ప్రసన్నం చేసుకొని ఈ కేసు నుంచి బయటపడాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. విచారణ కొనసాగుతున్న సమయంలో డీఎంహెచ్‌వో పిలవకపోయినా టచ్ హాస్పిటల్ నిర్వాహకులు కలెక్టరేట్‌కు వెళ్లడం వెనుక ఆంతర్యమేమిటని బాధిత కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. కలెక్టరేట్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తే అసలు విషయం తెలుస్తుందని వారు పేర్కొంటున్నారు.
బెల్లంపల్లికి చెందిన శివిని ఆమనికి మూడు ఆపరేషన్లు చేయడంపై విచారణ కొనసాగుతున్నది. ఈ నెల 8న ‘నమస్తే తెలంగాణ’లో ‘నెలలో మహిళకు మూడు ఆపరేషన్లు’ శీర్షికన కథనం ప్రచురితమవ్వగా, జిల్లా వైద్యాధికారి హరీశ్‌రాజ్ స్పందించి ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ఈ మేరకు శుక్రవారం వైద్య బృందం సభ్యులు డా.శివప్రసాద్, డా.అశోక్, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు టచ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితురాలిని కలిసి వివరాలు సేకరించారు. అనంతరం ఆమె రికార్టులను దాదాపు మూడు గంటల పాటు పరిశీలించారు.
ముఖ్యమైన సమాచారాన్ని సేకరించారు. విచారణ సమయంలో అధికారులు హాస్పిటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఆదివారం మరో ప్రత్యేక బృందం టచ్ హాస్పిటల్‌కు వెళ్లి మరిన్ని వివరాలు సేకరించినట్లు విశ్వనీయ సమాచారం. సోమవారం మధ్యాహ్నం మంచిర్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ హరీశ్‌రాజ్ కూడా నేరుగా హాస్పిటల్‌కు వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయమై ఆయనతో మాట్లాడగా.. విచారణ కొనసాగుతుందని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు టచ్ హాస్పిటల్ నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. త్వరలో హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ నుం చి స్పెషలిస్టులను పిలిపించి ఈ కేసుపై విచారణ చేయాలని కలెక్టర్ ఆదేశించినట్లు డీఎంహెచ్‌వో కార్యాలయ సిబ్బంది తెలిపింది.