ఆసిఫాబాద్ అంబేదర్చౌక్, జూలై 29 : జిల్లా కేంద్రంలోని ప్రధాన మంత్రి కౌశల్ కేంద్రం నిర్వాహకులు కాసుల కోసం కక్కుర్తి పడి విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. నిర్వాహకులు మాత్రం డబ్బుల కోసం ఆశపడి అడ్డదారులు తొక్కుతూ విద్యార్థులను బలి చేస్తున్నారు.
వీకాఫిన్ అనే ఆన్లైన్ యాప్ను పరిచయం చేసి, అందులో ఒత్తిడి చేసి మరీ విద్యార్థులను చేర్పిస్తున్నారు. రూ. 580 నుంచి రూ. లక్ష దాకా పెట్టుబడి పెట్టవచ్చని, 45 రోజుల పాటు ప్రతి రోజూ డబ్బులు పొందవచ్చని, పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వస్తుందని ఆశచూపుతూ వారిని ప్రోత్సహిస్తున్నారు.
సొమ్ము చేసుకుంటున్న నిర్వాహకులు
ఈ ఆన్లైన్ యాప్ మొత్తం గొలుసు సిస్టంలో నడుస్తున్నట్లు సమాచారం. మొదట జాయిన్ అయిన వారు తమకు తెలిసిన వారిని యాప్లో జాయిన్ చేస్తే.. జాయిన్ చేసిన వారికి అదనపు ఆదాయం సమకూరుతుంది. ఈ యాప్లో సుమారు 250 నుంచి 500 మంది వరకు జాయిన్ చేపిస్తే& యాప్ నిర్వాహకులు రూ. 5 లక్షల విలువైన కారు బహుమతిగా ఇస్తున్నట్లు పలువురు తెలిపారు.. అయితే, కౌశల్ కేంద్రం విద్యార్థులు ఎకువ సంఖ్యలో జాయిన్ అయ్యారు. దీంతో కేంద్రం నిర్వాహకులు ఇప్పటి వరకు రూ. లక్షల్లో సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతూ ఉందో అర్థం చేసుకోవచ్చు.
గతంలోనూ ఇదే తరహాలో మోసం..
పీఎం కౌశల్ కేంద్రం నిర్వాహకులు నకిలీ వేలి ముద్రలు సృష్టించి సొమ్ము కాజేస్తున్నట్లు మార్చి 29న ‘కౌశల్ కేంద్రంలో కాసుల కకుర్తి’ శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించి విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు అప్పటి కాంట్రాక్టర్, మొత్తం నిర్వాహకులు, ఉద్యోగులను తొలగించారు.