ఆదిలాబాద్, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ) : ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఆదిలాబాద్ జిల్లా గులాబీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. వరంగల్ సభకు భారీ సంఖ్యలో వెళ్లడానికి నాయకులు, కార్యకర్తలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆదిలాబాద్, బోథ్ ముఖ్యనాయకులు, కార్యకర్తలు సమావేశాలు నిర్వహించారు. ఆదిలాబాద్ నియోజకవర్గ సమావేశంలో మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్ నియోజకవర్గ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వరంగల్ సభను విజయవంతం చేసేలా నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి పల్లె నుంచి వెళ్లడానికి నాయకులు గ్రామస్థాయిలో సమావేశం నిర్వహించి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సభను విజయంవతం చేసేలా వాల్ రైటింగ్స్ ప్రారంభించారు. ఆదిలాబాద్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో వాల్ రైటింగ్స్ రాయించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైంది. రుణమాఫీ, రైతు భరోసా, తులం బంగారం ఇతర పథకాల అర్హులైన వారికి అందకపోవడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ సభకు గ్రామాల నుంచి జనం వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పటిష్టంగా ఉంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత నాయకులు పార్టీ వెన్నంటే ఉంటూ అధిష్టానం సూచనల మేరకు ప్రభుత్వ వ్యతరేక కార్యక్రమాలు చేపడుతున్నారు.