ఆదిలాబాద్, జూలై 19(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితి మీరుతున్నాయి. పేదల అవకాశాలను ఆసరా చేసుకుని ఫైనాన్స్ వ్యాపారులు అధిక వడ్డీలు వసూలు చేస్తూ పేదల నడ్డి విరుస్తున్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వడ్డీ వ్యాపారులు తమ ఏజెంట్ల ద్వారా దందాను కొనసాగిస్తున్నా రు. పేదలు నివసించే కాలనీల్లో వారు అధిక వ్యాపారం చేస్తున్నారు. ఎక్కువగా కూలీలు, చిరు వ్యా పారం చేసుకునే వారు తమ అవసరాల కోసం డబ్బులు అప్పుగా తీసుకుంటారు. తీసుకున్న డబ్బులను పేదలు ప్రతి వారం వడ్డీ వ్యాపారులకు చెల్లించాలి.
ఎలాంటి అనుమతులు లేకుండానే జిల్లా కేంద్రంతోపాటు జైనథ్, బేల మండలాల్లో వడ్డీ వ్యాపారులు దందా కొనసాగిస్తున్నారు. ఐదుగురిని గ్రూపుగా చేయడంతోపాటు వ్యక్తిగతంగా అప్పు ఇస్తారు. పట్టణాల్లోని ఆయా ప్రాంతాలు గ్రామాల్లో తమ ఏజెంట్ల ద్వారా డ బ్బులు అవసరమైన వారిని గుర్తిస్తారు. వారికి తక్కువ వడ్డీ తో అప్పు ఇస్తామని.. వారం, వారం చెల్లించే వెసులుబాటు ఉంటుందని మాయమాటలు చెప్పి దందా కొనసాగిస్తున్నారు.
వడ్డీ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలి..
పేదలకు అవసరమైన డబ్బులు ఇస్తున్న వడ్డీ వ్యాపారులు 25 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తారు. వారం, వారం చెల్లింపుల పేరిట అసలు, వడ్డీ గుంజుతారు. పేదలు తమ అవసరాల కోసం రూ.10 వేల అప్పు తీసుకుంటే ఇన్సూరెన్స్ పేరిట ముందుగా రూ.200 తీసుకుని రూ. 9,800 ఇస్తారు. వీరు ప్రతి నెల రూ.600 చొప్పున 21 వారాలు చెల్లించాలి. ఇలా 21 వారాలకు గానూ రూ.12,600 చెల్లించాలి. ప్రధానంగా భవన నిర్మాణ పనులు, ఇతర కూలీ పనులు చేసే వారికి వారం, వారం డబ్బుల వస్తాయి. ఇలా వచ్చిన డబ్బులను వారు బాకీ తీసుకున్న వ్యాపారులకు చెల్లిస్తారు.
అప్పు తీసుకున్న పేదలు ప్రతి వారం వడ్డీతోపాటు అసలు తప్పనిసరి చెల్లించాలి. వడ్డీ ఇచ్చిన పట్టణాల్లోని కాలనీలు, గ్రామాల్లో వసూళ్లకు ఉదయం 6 గంటలకే ప్రత్యక్షమవుతారు. గంట వ్యవధిలో తమ పనికానిచ్చుకునే తిరుగు పయాణం అవుతారు. అప్పు తీసుకున్న వారు పలు కారణాలతో డబ్బులు కట్టలేని స్థితిలో ఉన్న వారిని భయందోళనలకు గురి చేస్తారు. దాడులకు కూడా పాల్పడుతారు. ఎలాంటి అనుమతులు లేకుండా జిల్లాలో నిర్వహిస్తున్న వడ్డీ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని పేదలు కోరుతున్నారు.