ఎదులాపురం, ఆగస్టు 29 : సమసమాజ నిర్మాణానికి పాటుపడ్డ మహనీయుల జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, వారి ఆశయ సాధనకు పాటు పడాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌నగర్‌లో సాహిత్య సామ్రాట్ అన్నాభావు సాఠే 103వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యేకు నిర్వాహకులు డప్పుచప్పుళ్ల నడుమ స్వాగతం పలికారు. అనంతరం మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. సాహితీ రంగంలో విశేష సేవలందించి సమాజ అభ్యున్నతికి పాటు పడిన మహనీయుడు సాహిత్య సామ్రాట్ అన్నాభావు సాఠే అన్నారు. ఆయన జయంతి వేడుకలను భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లల విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అన్నాభావుసాఠే, అంబేద్కర్ జీవిత గాధలతో ప్రతి ఒక్కరూ ప్రేరణ పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు విజ్జగిరి నారాయణ, దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్, మహిళా విభాగం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు స్వరూపారాణి, మమత, పర్వీన్, నాయకులు సాజిదొద్దీన్, ఎజాజ్, కరుణ తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారులు రాణించేందుకు చేయూత
ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 29 : అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తున్నదని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. క్రీడాదినోత్సవం సందర్భంగా ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో ఎమ్మెల్యే క్రీడా జ్యోతి వెలిగించారు. ర్యాలీని ప్రారంభించారు. అనంతరం పలు పోటీలను ప్రారంభించారు. హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలను తిలకించారు. క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి మూలమన్నారు. అనంతరం ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ రంజానీ తదితరులు పాల్గొన్నారు.