నస్పూర్, అక్టోబర్ 18 : రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న గ్రూప్ -2, 3 పరీక్షల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డి అన్నారు. పరీక్షల నిర్వహణపై శుక్రవారం హైదరాబాద్ లోని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం నుంచి ఇతర కమిషన్ సభ్యులు, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రూప్-2 పరీక్షలు డిసెంబర్ 15, 16వ తేదీల్లో , గ్రూప్-3 పరీక్షలు నవంబర్ 17, 18వ తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. అధికారులు పరీక్షా కేంద్రాలు, స్ట్రాంగ్ రూములను గుర్తించి వసతులు, ఏర్పాట్లపై పూర్తి వివరాలతో నివేదికలు అందించాలన్నారు. అనంతరం మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ గ్రూప్ -2, 3 పరీక్షల కోసం జిల్లాలో 48 కేంద్రాలను ఏర్పాటు చేశామని, దాదాపు 15 వేల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో తగిన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మోతీలాల్, పోలీసు నోడల్ అధికారి సుందర్రావు, ఆర్సీ నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ టౌన్, అక్టోబర్ 18 : టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, అదనపు కలెక్టర్లు దీపక్ తివా రీ, దాసరి వేణు, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శు క్లా, అదనపు ఎస్పీ ప్రభాకర్‌రావు, ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రూప్-2, 3 పరీక్షల కోసం జిల్లాలు 18 కేంద్రాలను ఏర్పా టు చేశామని, 4 500 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. కాగజ్‌నగర్‌లో 9 కేంద్రాలు, ఆసిఫాబాద్‌లో 9 కేం ద్రాలు ఏర్పాటు చేసి, ఆయా పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు అసౌకర్యం కలుగకుండా తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, డెస్ బెంచీలు, ప్రహరీ , ర్యాంపులు, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, అక్టోబర్ 18: త్వరలో జరగనున్న గ్రూప్-2, 3 పరీక్షల సంబంధిత ప్రశ్నాపత్రాలను భద్రపరిచేందుకు కలెక్టరేట్ లో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే తెలిపారు. శుక్రవారం స్ట్రాంగ్ రూమ్‌ను అదనపు కలెక్టర్లు, సబ్ కలెక్టర్, అదనపు ఎస్పీ, ఆర్డీవోతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఖజానా అధికారి భానుమతి, ప్రాంతీయ సమన్వయకర్తలు లక్ష్మీ నరసింహ, రాజేశ్వర్ సిబ్బంది పాల్గొన్నారు.
కాగజ్‌నగర్, అక్టోబర్ 18: జిల్లాలో నిర్వహించనున్న గ్రూప్-2, 3 పరీక్షల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లు చేయాలని కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా అన్నారు. శుక్రవారం పట్టణంలోని వసుంధర డిగ్రీ కళాశాల, సెయింట్క్లారెటి విద్యాలయం, ఫాతిమాకాన్వెంట్, సుప్రభాత్ విద్యాలయం, జవహార్ నవోదయ విద్యాలయంలో నిర్వహించనున్న గ్రూపు పరీక్షల ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్‌కుమార్, తదితరులున్నారు.