ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. శుక్రవారం జిల్లాలో అధికంగా 40.8 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భానుడు భగ భగ మండుతుండడంతో మధ్యాహ్నం పూట బయటకు వెళ్లాలంటనే ప్రజలు జంకుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో వారం రోజులుగా 39 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా శుక్రవారం ఒక్కసారిగా 40.8 డిగ్రీలకు ఉష్ణోగ్రత పెరిగింది. తలమడుగు, భోరజ్ మండలాల్లో 40.8 డిగ్రీలు, సాత్నాలలో 40.5 డిగ్రీలు, జైనథ్‌లో 40.4 డిగ్రీలు, ఆదిలాబాద్ అర్బన్‌లో 40.1 డిగ్రీలు, బేలలో 40.1 డిగ్రీలు, ఇచ్చోడలో 39.2, మావలలో 39.2, భీంపూర్‌లో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
జిల్లా వ్యాప్తంగా ఎండల ప్రభావం మరింత పెరుగనుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఎండ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం పూట పట్టణంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. తమ పనుల కోసం బయటకు పోతున్న వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తలకు క్యాపులు ధరించడంతో పాటు కాటన్ దుస్తులు ధరిస్తున్నారు. ఉక్కపోత కారణంగా ఇండ్లలో సైతం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం పెరిగింది. పెట్రోల్ బంకుల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కూలర్లు పెడుతున్నారు. జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు. ఎండ సమయంలో బయట తిరగవద్దని, మంచినీరు బాగా తీసుకోవాలని, ఎండలో పనిచేయవద్దని, వడదెబ్బకు గురైన వారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు.
– ఆదిలాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ)