మంచిర్యాల, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తున్నది. గడిచిన నాలుగైదు రోజుల్లో రాష్ట్రంలోనే అతితక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యా హ్నం సైతం వాతావరణం చల్లగానే ఉంటుంది. సా యంత్రం 6 గంటలయ్యిందంటే చాలు జనాలు బయటికి రావడం లేదు. ఉదయం 8 గంటల దాటాక కూ డా వాతావరణం పొగమంచుతో కప్పి ఉంటుంది. ని త్యం జన సంచారం, వాహనాల రాకపోకలతో రద్దీగా కనిపించే రోడ్లు చీకటి పడిందంటే చాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ(టీజీడీపీఎస్) ప్రకారం.. బుధవారం రాష్ట్రంలోనే అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యూ)లో 5.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా బేలలో మంగళవారం 5.8 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే, బుధవారం 6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక నిర్మల్ జిల్లా మామడ మండలం తండ్రా గ్రామంలో 7.3 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాల్పూర్లో 9.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని టాప్ 15 జిల్లాల్లో నాలుగు జిల్లాలు ఉమ్మడి ఆదిలాబాద్ నుంచే ఉన్నాయంటే ఇక్కడ చలి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ బంగాళఖాతంలోని మధ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఫలితంగా రానున్న రెండు, మూడు రోజులు ఉమ్మడి జిల్లా లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన మార్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతేగానీ బయటికి రాకూడదని, తెల్లవారుజూమున, రాత్రి వేళ బయటికి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యూ), తిర్యాణి మండలాల్లో అతి తక్కువ నాలుగు నుంచి ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల పని వేళలను మార్పు చేస్తూ కలెక్టర్ రాజర్షిషా బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఉదయం 9.15 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు ఉండగా, ప్రస్తుతం ఉదయం 9.40 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటలక మారుస్తున్నట్లు పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మార్చిన సమయాన్నే కొనసాగించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు డీఈవో, ఎంఈవోలు, ఉన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు.