మంచిర్యాల, జూన్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతుండగా కార్మికలోకం కన్నెర్ర చేస్తున్నది. సింగరేణి జోలికి వస్తే ఊరుకునేది లేదని, అవసరమైతే ఉద్యమాలు చేసి సంస్థను కాపాడుకుంటామని స్పష్టం చేస్తున్నది. 130 ఏళ్లకు పైగా చర్రిత, ప్రపంచంలో అత్యుత్తమ టెక్నాలజీ, 41 వేల స్కిల్డ్ మ్యాన్‌పవర్ ఉన్న సంస్థను కాదని సింగరేణిబొగ్గు గనులను ప్రైవేట్‌కు కేటాయిస్తే తామేం చేయాలంటూ మండిపడుతున్నది. బొగ్గు గనులు ప్రైవేటుకు ఇచ్చి, ఉన్న గనులు మూతపడ్డాక మా ఉద్యోగాలకు భరోసా ఏదని ప్రశ్నిస్తున్నది. ఉత్పత్తి, ఆదాయంలో అన్ని సంస్థలకంటే ముందున్న సింగరేణిపై అనవసర రాజకీయాలు చేయడం మానుకోవాలని, ఏదేమైనా వేలాన్ని అడ్డుకుంటామని, సింగరేణిని రక్షించుకుంటామని కార్మికులు స్పష్టం చేస్తున్నారు.
బొగ్గు గనుల వేలంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ శుక్రవారం సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన కార్మికులు, ఆయా సంఘాల నాయకులు అవసరమైతే సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. సంస్థలో 20 వేల మంది 35 నుంచి 45 ఏళ్లున్నవారు ఉన్నారని, కంపెనీ వేలంలో బావులు ప్రైవేట్ వాడికి వెళ్తే.. ఉన్న బావులు అయిపోయాక ఈ 20 వేల మంది భవిష్యత్తు ఏమిటనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా దశలవారీగా నిరసనలు వ్యక్తం చేస్తామని, అప్పటికీ మార్పు రాకపోతే సమ్మె తప్పదని కార్మికులు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే లాభాల్లో ఉన్న సింగరేణిని నష్టాల్లోకి నెట్టిందని, రాష్ట్ర ప్రభుత్వానిది 51 శాతం వాటా ఉంటే, కేంద్రానిది 49 శాతం వాటా ఉండేదని, కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు చేసి చివరకు 49 శాతం వాటాను కుదువపెట్టిందని, మరోసారి ప్రైవేటీకరణకు సహకరించాలని చూస్తున్నదని కార్మికులు మండిపడుతున్నారు.
సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతుండగా, ఆ జాబితాలో మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా పరిధిలోని శ్రావణపల్లి మైన్ సైతం ఉంది. సింగరేణిని ప్రైవేటీకరించమని మోదీ రామగుండం ఎరువుల ప్యాక్టరీకి వచ్చి చెప్పి వెళ్లిన మరునాడే కేంద్ర ప్రభుత్వం రెండు బొగ్గు గనులకు వేలం వేసింది.
కానీ, అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం తీవ్రంగా ప్రతిఘటించింది. వేలం వేయొద్దంటూ కార్మికుల పక్షాన పోరాటాలు చేసింది. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కారు మోదీ ప్రభుత్వానికి వంత పాడుతున్నది. వేలంలో పాల్గొనాలంటూ సింగరేణి సంస్థపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారమున్నది. చేయాల్సిందంతా చేసి కేసీఆర్ సర్కారుపై నిందలు మోపాలని చూస్తున్నది. కేసీఆర్ ఉన్నప్పుడే బొగ్గు గనులు వేలం వేశారని చెబుతూ.. మొత్తం సింగరేణిని ఆగం చేసేందుకు కుట్రలు చేస్తున్నది.
శ్రీరాంపూర్, జూన్ 22 : కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి కార్మికులు 41 రోజులు సకల జనుల సమ్మె చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. కార్మికులపై ప్రత్యేక అభిమానంతో అనేక హక్కులు కల్పించారు. 10 ఏళ్ల క్రితమే బీజేపీ ప్రభుత్వం గనులు ప్రైవేట్ పరం చేయాలని కుట్ర పన్నితే కేసీఆర్ కాపలా ఉండి కాపాడారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్రానికి సహకరిస్తుంది. వెంటనే సింగరేణికి గనులు కేటాయించాలి. లేదంటే ఉద్యమాలు తప్పవు.
-సాదుల భాస్కర్, ఎస్పార్పీ-3 ఫ్యాన్ ఆపరేటర్, శ్రీరాంపూర్
శ్రీరాంపూర్, జూన్ 22 : బీజేపీ ప్రభుత్వ రంగ పరిశ్రమలను అమ్మేస్తున్నది. ఇందులో భాగంగానే సింగరేణిని కూడా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తున్నది. గతంలో ఆంధ్రోళ్లు మనలను దోచుకున్నరు. ఇప్పుడు మన తెలంగాణ వాడే బొగ్గు,గనుల శాఖ మంత్రిగా ఉండి మనల్ని, సింగరేణిని దోచి మోదీకి పెట్టాలని కుట్రలు చేస్తున్నడు. కార్మిక వర్గం మోస పోవద్దు. కొత్త చట్టంలోనే కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ర్టానికి బొగ్గు గనులు నేరుగా కేటాయించింది. సింగరేణిలో ఎందుకు ఇవ్వరో చెప్పాలి.
-తొంగల రమేశ్, ఎస్డీఎల ఆపరేటర్, శ్రీరాంపూర్
రెబ్బెన, జూన్ 22 : సింగరేణి సంస్థలోని గనులు ప్రైవేట్‌పరమైతే ఇబ్బందులు తప్పవు. ఉద్యోగావకాశాలు తగ్గుతాయి. కేంద్రం గతంలో కూడా గనుల వేలం కోసం యత్నించగా అప్పటి కేసీఆర్ సర్కారు అడ్డుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే అప్పటి సర్కారు సింగరేణిలో 49 శాతం వాటాను కేంద్రానికి అప్పగించింది. సింగరేణి సంస్థలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఈ విషయాన్ని గుర్తించాలి.
– వంగ మహేందర్‌రెడ్డి, సీనియర్ మైనింగ్ సర్దార్, బెల్లంపల్లి ఏరియా
రెబ్బెన, జూన్ 22 : సింగరేణిలోని గనులను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే భవిషత్తులో ఉపాధి కోల్పోయే అవకాశముంది. వేలంతో సంబంధం లేకుండా సింగరేణికి బ్లాక్‌లు కేటాయించాలి. సింగరేణి సంస్థ వేలంలో పాల్గొనడం వలన 4 శాతం గరిష్ఠంగా తట్టుకొని 20 శాతం రాయల్టీ చెల్లించి గనులు దక్కించుకొవడం వల్ల బ్లాక్‌లో నష్టం జరిగే అవకాశముం టుంది. గనులు కేటాయించే పద్ధతి ఇలాగే కొనసాగితే 20 ఏళ్ల తర్వాత సింగరేణి మూతపడక తప్పదు. తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎం అయిన తర్వాత గనుల వేలం పాటకు ఎవ్వరూ సాహసించలేదు.
– మల్రాజు శ్రీనివాసరావు, టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు
మందమర్రి, జూన్ 22 : సింగరేణిలో నూతనంగా గుర్తించిన బొగ్గు బ్లాకుల ను సింగరేణికే కేటాయించాలి. కార్పొరే ట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నించడం సరికాదు. సింగరేణి ప్రైవేటుపరం కావడం వల్ల ఈ ప్రాంతంలో నిరుద్యోగం పెరిగి పోతుంది. సింగరేణి సంస్థ మనుగడ కూ తీవ్ర నష్టం వాటిల్లుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేదంటే సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు మొదలవుతాయి. సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధమే.
– అందె శ్రీకాంత్, సింగరేణి కార్మికుడు, మందమర్రి.
శ్రీరాంపూర్, జూన్ 22 : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలను ఆదరించినందుకు ఇదా సింగరేణి కార్మికులకు ఇచ్చే బహుమానం. కార్మికుల మరోసారి మోసపోయారు. సింగరేణి సంస్థలో గనులు ప్రైవేటీకరణకాకుండా కేసీఆర్ అడ్డుపడ్డరు. ఆయన హయాంలో గనుల ప్రైవేటీకరణ, వేలాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. కానీ ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒకే వేదిక పంచుకొని కమీషన్ల కక్కుర్తితో గనులను వేలం వేయాలని చూస్తున్నది. ఇది కార్మిక వర్గం సహించదు. తగిన బుద్ధి చెప్పి తీరుతారు.
-గోదారి భాగ్యరాజ్, కోల్‌కట్టర్, శ్రీరాంపూర్
శ్రీరాంపూర్, జూన్ 22 : కేంద్రం గనులను దౌర్జన్యంగా లాక్కొని సంస్థను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది. గను లను ప్రైవేట్ వాడికి అప్పగిం చి.. ఆపై నష్టాలు చూపి ఉద్యో గాల్లేకుండా మోసం చేసే కుట్ర చేస్తున్నది. అటు ఆంధ్రాలో తెలంగాణకు వ్యతిరేకమైన పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇటు తెలంగాణలో ఆయన శిష్యుడు వచ్చాడు. ఇద్దరు కలిసి తెలంగాణలో ఉద్యోగ, ఉపాధి అకాశాలు లేకుండా కుట్రలు చేస్తున్నరు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుంటే ఒక్క బొగ్గుపెల్ల కూడా ప్రైవేట్ సంస్థలు తీయలేవు. కార్మికులు పోరాడి గనులు సాధించుకుంటరు.
-తీగల వెంకట్‌రెడ్డి, ట్రామర్, శ్రీరాంపూర్
మందమర్రి, జూన్ 22 : గతంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణి బొగ్గు బ్లాకులకు టెండరు నిర్వహిం చేందుకు యత్నించగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుం ది. చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ కార్మికుల మద్దతు కూడగట్టి మందమర్రి మార్కెట్లో 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకించ డంతో పాటు ప్రజాప్రతినిధులు ఆందోళన బాట పట్టడం తో కేంద్రం టెండరు ప్రక్రియను వెనక్కి తీసుకుంది. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు కేంద్ర ప్రభుత్వం కుట్రలను వ్యతి రేకించాలి. బొగ్గు గనుల ప్రైవేటీకరణపై తమ వైఖరిని కార్మికులకు స్పష్టం చేయాలి. లేని పక్షంలో కార్మికులు ఆందోళన బాట పట్టడంతో పాటు ప్రజాప్రతినిధులను అడ్డుకునే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి.
– బెల్లం అశోక్, సింగరేణి కార్మికుడు, మందమర్రి