మంచిర్యాల, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్రేంజ్ అడవుల్లో నెలన్నరగా సంచరిస్తున్న పెద్దపులి(ఎస్-12) కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి అడవుల్లోకి వెళ్లిపోయింది. హజీపూర్, కాసిపేట మండలాల్లోని అటవీ ప్రాంతంలో మకాం వేసిన పులి పాడిపశువులపై దాడులు చేసింది. అటవీ శాఖ అధికారులు అటు పెద్దపులికి, ఇటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. సీసీ కెమెరాలతో పులిని నిత్యం ట్రాక్ చేస్తూ.. పులి సంచారం ఎక్కడ ఉంటే ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ వచ్చారు.
పులి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం లక్షెట్టిపేట రేంజ్ దాటుకొని బెల్లంపల్లి రేంజ్ ముత్యంపల్లి, దేవాపూర్ మీదుగా తిర్యాణి అడవుల్లోకి పెద్దపులి ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ పులి ఆడ తోడు కోసం తిరుగుతుందని, అందులో భాగంగానే తిర్యాణి అడవుల్లోకి వెళ్లిందని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు.
కాసిపేట, నవంబర్ 14 : కాసిపేట మండలం దేవాపూర్, ధర్మారావుపేట, వెంకటాపూర్ అటవీప్రాంతం నుంచి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండల పరిధిలోని ఎగ్గెండి-ఏదులపాడ్ ప్రాంతంలోకి చేరుకున్న పెద్ద పులి పాదముద్రలను గురువారం అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంత పల్లెల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అడవుల్లోకి వెళ్లవద్దని ఫారెస్ట్ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.