కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/మంచిర్యాలటౌన్, జూన్ 2 : మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. మంచిర్యాలలోని అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్ సంతోష్, అదనపు కలెక్టర్ రాహుల్, డీసీపీ అశోక్‌కుమార్, ఆర్డీవో రాములు, మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్, మంచిర్యాల, జైపూర్ ఏసీపీ లు ప్రకాశ్, వెంకటేశ్వర్ పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. అనంతరం న స్పూర్‌లోని కలెక్టరేట్లో మహత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూలమాలలు వేశారు.
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌర వ వందనం స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వ ఫలా లు అందించేందుకు అధికార యంత్రాంగం పారదర్శకంగా పనిచేస్తుందన్నారు. అన్ని శాఖల సమన్వయంతో జిల్లా అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయాల ప్రాంగణంలో కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ సురేశ్‌కుమార్, జడ్పీ చైర్మన్ కృష్ణారావుతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు.
ఆయన మాట్లాడుతూ ఎందరో అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందన్నారు. గోలేటిలో తెలంగాణ కోసం కొట్లాడి జైలు జీవితం గడిపిన ఉద్యమకారులు అజ్మీర బాబురావు, బోగే ఉపేందర్, వినోద్‌జైస్వాల్, దుర్గం రవీందర్, తోట లక్ష్మణ్, వామన్‌ను గోలేటి వెల్పేర్ సొసైటీ సభ్యులు వసీం, మొయిజ్, హుస్సేన్ సన్మానించారు. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. సింగరేణిలో జీఎంలు, అధికారులు, నాయకులు, కార్మికులు వేడుకలను వైభవంగా నిర్వహించారు. ప్రధాన వీధులగుండా ర్యాలీలు తీశారు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు.