బెల్లంపల్లి/కన్నెపల్లి, మార్చి 16 :తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్చార్జి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని బెల్లంపల్లి, కన్నెపల్లి, నెన్నెల మండలాల్లో ఆయన గురువారం పర్యటించారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు అభివృద్ధిలో పరుగులు తీస్తూ మరో వైపు సంక్షేమ పథకాలతో బడుగు, బలహీన వర్గాలకు అండ గా నిలుస్తున్నదని తెలిపారు. బీజేపీ పాలిత రా ష్ర్టాల్లో ఎక్కడైనా ఇలాంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారా ? అని సవాల్ విసిరారు. తునికాకు సేకరణలో కూలీలకు ఇచ్చే రేట్ల కట్టకు రూ.2.05 నుంచి రూ.3కు పెంచామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2016 నుంచి 2021 వరకు రూ.250 కోట్లను బోనస్ చెల్లిస్తున్నామని వెల్లడించారు. లక్షన్నర మందికి పోడు వ్యవసాయ పట్టాలు అందిస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 1100 కుటుంబాలకు దళిత బంధు పథకం అందిస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే చిన్న య్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాని తెలిపారు. ప్రతిపక్షాలు ఆరోపణలు మాని నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడాలని సూచించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సీపీఆర్‌పై అవగాహన కలిగి ఉండాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సూచించారు. బెల్లంపల్లి వంద పడకల దవాఖానలో వైద్య శాఖ ఆధ్వర్యంలో సీపీఆర్ (కార్డియో పల్మనరీ రీససిటేషన్)పై అవగాహన కార్యక్రమంలో ఎమ్మె ల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి పాల్గొన్నారు. కరోనా తర్వాత గుండె పోటు కేసులు పెరుగుతున్నాయని ఈ నేపథ్యంలో సీపీఆర్ పద్ధతిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి కాల్టెక్స్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఎమ్మెల్యే దుర్గం చిన్న య్య ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికారు. కాల్టెక్స్ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం లో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి నేరుగా ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి వెళ్లిన మంత్రి ఫారెస్ట్ అధికారుల గౌరవ వందనం స్వీకరించారు. కన్నెపల్లి మండలం ఎల్లారం గ్రామంలో రూ.1.50 కోట్ల ఐటీడీఏ నిధులతో చర్లపల్లి ఆర్అండ్బీ రహదారి నుంచి ఎల్లారం వరకు చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తునికాకు సేకరణ దారులకు చెక్కులు పంపిణీ చేశారు. కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. మహిళా సంఘాలకు రుణ మాఫీ కింద రూ.2,63,27,000 విలువైన చెక్కులను అం దించారు. మైలారం, దుబ్బపల్లి గ్రామాలకు రూ.1.50 కోట్ల వ్యయంతో చేపట్టిన బీటీరోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.