నార్నూర్, నవంబర్ 1 : గిరిజన రైతుల అభ్యున్నతి కోసమే రాష్ట్ర ప్రభుత్వం గిరి వికాసం చేపట్టిందని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. మండలంలోని మలంగిలో గిరి వికాసం పథకం ద్వారా మంజూరైన బోరుబావిని మంగళవారం వారు ప్రారంభించారు. లబ్ధిదారులకు మంజూరైన మోటర్ పంపులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గిరి వికాసం పథకం ద్వారా మలంగిలో 22, మలేపూర్లో 15 మందికి బోరుబావులు మంజూరుచేసిందన్నారు.
ప్రభుత్వం 2018 నుంచి నార్నూర్ మండలానికి అభివృద్ధి, సంక్షేమం పరంగా రూ.28 కోట్లు ఖర్చుచేసిందన్నారు. దళితబంధు కింద నియోజకవరాగనికి 1500 యూనిట్లు మంజూరుచేసిందని తెలిపారు. మండలానికి 150యూనిట్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌శాఖ ఎస్ఈ జాడే ఉత్తమ్, అడిషనల్ డీఆర్డీవో రవీందర్, విద్యుత్‌శాఖ డీఈ సుభాష్‌జాదవ్, ఏడీఈ చంద్రశేఖర్, వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, ఐటీడీఏ డైరెక్టర్ మడావి మాన్కు, గిరి వికాసం ఏపీడీ సిద్ధిక్, ఎంపీడీవో కావల రమేశ్, సర్పంచ్ పుసం రూపాబాయి గోపాల్, జీవ వైవిధ్య జిల్లా కమిటీ సభ్యుడు మర్సుకోల తిరుపతి, ఎంపీపీ తనయుడు కనక ప్రభాకర్, డైరెక్టర్ దుర్గే కాంతారావ్, నాయకులు మెస్రం హన్మంత్‌రావ్, మెస్రం మానిక్రావ్, సకారం పాల్గొన్నారు.
గాదిగూలో మండల సర్వసభ్య సమావేశం..
గాదిగూడ రైతువేదిక భవనంలో ఎంపీపీ ఆడా చంద్రకళారాజేశ్వర్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముందుగా ఆయా శా ఖల అధికారులు మండల ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథులుగా హాజరైన జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే మాట్లాడారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో మండలాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. సమావేశంలో జడ్పీటీసీ మెస్రం గంగుబాయిసోము, తహసీల్దార్ ఆర్కా మోతీరాం, ఎంపీడీవో రామేశ్వర్, వైస్ ఎంపీపీ మర్సివనే యోగేశ్, ఆయా శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.