Kawal tiger reserve | వన్య సంరక్షణకు అండర్ పాస్‌లు.. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు
నిర్మల్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ జోన్లో వన్యప్రాణుల రక్షణకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ), మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ైక్లెమెట్ చేంజ్ సూచన మేరకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నది. ఇందులో భాగంగానే నిర్మల్ నుంచి ఖానాపూర్ వరకు నిర్మిస్తున్న ఎన్‌హెచ్-61 పనులపై దృష్టి కేంద్రీకరించారు.
- నిర్మల్-ఖానాపూర్ హైవే నంబర్ 61పై కొత్త కార్యాచరణ
- రూ.80. 50 కోట్లతో ఏడు చోట్ల నిర్మాణం
- జంతువులు అధికంగా సంచరించే ప్రాంతాల గుర్తింపు
- వేటగాళ్ల కదలికలపైనా పటిష్ఠ నిఘా
Kawal tiger reserve | నిర్మల్, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ): నిర్మల్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ జోన్లో వన్యప్రాణుల రక్షణకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ), మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ైక్లెమెట్ చేంజ్ సూచన మేరకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నది. ఇందులో భాగంగానే నిర్మల్ నుంచి ఖానాపూర్ వరకు నిర్మిస్తున్న ఎన్‌హెచ్-61 పనులపై దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుతం ఈ రోడ్డు జాతీయ రహదారిగా మారనున్న నేపథ్యంలో ఇకపై ప్రతిరోజు వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. దీంతో రిజర్వ్ జోన్‌లోని వన్య ప్రాణులు రోడ్డుకు ఇరువైపులా సంచరించే సమయంలో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుందని కేంద్ర అటవీశాఖ హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో నేషనల్ హైవేస్, ఆర్అండ్బీ అధికారులకు నోటీసులు జారీ చేసింది. రోడ్డు నిర్మాణం కారణంగా, అలాగే నిర్మాణం పూర్తయిన తర్వాత వాహనాలు సంచరించే సమయంలో ఏ ఒక్క వన్యప్రాణికీ ప్రమాదం జరుగకుండా చూడాల్సిన అవసరముందంటూ అటవీశాఖ సంబంధిత శాఖల అధికారులకు సూచించింది. దీంతో ఆయా శాఖలు వన్యప్రాణుల సంరక్షణపై సీరియస్‌గా కసరత్తు జరిపి పక్కా ప్రణాళికను రూపొందించాయి. ఇందులో భాగంగానే నిర్మల్ నుంచి ఖానాపూర్ వరకు హైవేపై 7 చోట్ల అండర్‌పాస్‌లు నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటికి అనుగుణంగానే ఇప్పటికే అటవీశాఖకు భూసేకరణ కోసం రూ.14 కోట్లను కేటాయించారు. దీంతో పాటు రూ.80.50 కోట్లతో ఏడు అండర్‌పాస్‌ల నిర్మాణానికి అంచనాలు తయారు చేశారు. ఈ అంచనాలకు కేంద్ర పర్యావరణ శాఖ ఇటీవలే అనుమతులు జారీ చేసింది. నేషనల్ హైవే, ఆర్అండ్బీ శాఖ ఇక పనులు చేపట్టేందుకు సిద్ధమైంది.
వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో..
హైవే నిర్మాణం మొదలు కావడంతో వన్యప్రాణులు ఎక్కువగా నివాసం ఉండే ప్రాంతాలే కాకుండా, సంచరించే ప్రాంతాలపై అటవీ శాఖ ప్రత్యేక సర్వే నిర్వహించింది. నిర్మల్-ఖానాపూర్ హైవేపై బోరిగాం నుంచి మామడ గ్రామాల మధ్య ఒకటి, అలాగే మామడ-దిమ్మదుర్తి గ్రామాల నడుమ ఉన్న అటవీ ప్రాంతంలో రెండు చోట్ల, దిమ్మదుర్తి-ఎగ్బాల్పూర్ గ్రామాల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో రోడ్డుపై మూడు చోట్ల, ఎగ్బాల్పూర్ నుంచి ఖానాపూర్ నడుమ ఒక చోట అండర్‌పాస్ నిర్మించనున్నారు.
అనేక అడ్డంకులు..
నిర్మల్ నుంచి ఖానాపూర్ వరకు నిర్మించ తలపెట్టిన 61వ నంబర్ జాతీయ రహదారి పనులకు మొదటి నుంచి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనేక అడ్డంకులు సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం చాలా సార్లు అనుకూల ప్రతిపాదనలు రూపొందించి పంపినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కనికరించకుండా ఆ ప్రతిపాదనలను తిరస్కరించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా పలు నిబంధనలను అమలు చేయాలని ఆదేశించింది. ఈ రోడ్డు విస్తరణలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న టేకు చెట్ల తొలగింపు ఓ ప్రహసనంగా మారింది. ఒక చెట్టు తొలగింపునకు 10 చెట్లు నాటించాలనే అంశంపై స్పష్టత రావడంతో రోడ్డు నిర్మాణ పనులకు ఎట్టకేలకు అనుమతులు లభించాయి. ఆ తర్వాత వన్యప్రాణుల సంరక్షణపై కూడా అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. సంబంధిత అధికారులు పలుమార్లు ఈ ప్రతిపాదనపై కసరత్తు జరిపారు. ఈ ప్రతిపాదనలను మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ైక్లెమెట్ చేంజ్‌కు పంపారు. అలాగే కేంద్ర వైల్డ్‌లైఫ్ బోర్డు కూడా మొదట్లో పలు అభ్యంతరాలను వ్యక్తం చేసింది. చివరకు అటవీశాఖ అధికారులు వన్యప్రాణుల సంరక్షణ కోసం ‘అండర్‌పాస్’ల నిర్మాణంపై రూపొందించిన ప్రతిపాదనలను పంపింది. ఎట్టకేలకు కేంద్ర అటవీశాఖ ఈ ప్రతిపాదనలను ఆమోదించి అనుమతులు జారీ చేసింది. చాలా ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న అనుమతులకు మంజూరు లభించడంతో సంబంధిత శాఖ అధికారులు ఇక పనులు మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
వేటగాళ్లపై నిఘా..
కవ్వాల్ అభయారణ్యంలో వన్యప్రాణుల వేటపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే సమీప గ్రామస్తులతో కలిసి నిఘా కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే సంబంధిత బీట్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లు, రేంజ్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో నిఘాను ముమ్మరం చేశారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో అటవీశాఖ రహస్యంగా ఇన్‌ఫార్మింగ్ నెట్‌వర్క్‌ను కొనసాగిస్తున్న క్రమంలోనే వన్యప్రాణుల వేటపై కూడా ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తున్నది. వన్యప్రాణుల వేట విషయంలో సమాచారం అందిస్తే గ్రామ నిఘా కమిటీలకు అటవీశాఖ నగదు రివార్డులతో పాటు ఇతర ప్రోత్సాహకాలను అందజేసేందుకు సిద్ధమైనట్లు సంబంధిత అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
త్వరలోనే పనులు ప్రారంభిస్తాం..
నిర్మల్-ఖానాపూర్ హైవేపై అటవీ ప్రాంతం లో వన్యప్రాణులు సంచరించేందుకు వీలుగా అండర్‌పాస్‌ల నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. మొత్తం ఏడు చోట్ల అండర్‌పాస్‌లు నిర్మించనున్నాం. వీటి కోసం రూ.80.50 కోట్లు మంజూరయ్యాయి. త్వరలోనే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం.
– బీ.సుభాష్ బాబు, ఎన్‌హెచ్ డీఈఈ
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

