కడెం/దస్తురాబాద్/కాసిపేట/జన్నారం, డిసెంబర్ 12 : కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్షి పథకంతో ఉపాధి కోల్పోయామని, తమకు న్యాయం చేయాలని ఆటో డ్రైవర్లు కోరారు. ఈ మేరకు మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. కడెం మండల కేంద్రంలోని నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారిపై యూనియన్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయా ణం కల్పించడం వల్ల ఆటో, ఇతర ప్రైవేట్ వాహనదారులంతా ఉపాధి కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ర్యాలీగా స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని తహసీల్దార్ రాజేశ్వరికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గంగన్న, పర్షి, జాకీర్, మౌళి, కాశీపాక శ్రీనివాస్, నగేశ్, అనోక్, పంజాల శ్రీనివాస్, రాజేందర్, గంగాధర్, వాజీద్, చంద్రయ్య, లచ్చన్న, జునైద్, జైపాల్, జాడి లచ్చన్న, రాజు, సెగ్గం శ్రీనివాస్, రాజన్న, శైలేందర్, హాజీఖాన్ ఉన్నారు.
దస్తురాబాద్‌లో..
దస్తురాబాద్ మండల కేంద్రంలో టాటా ఏస్,ఆటో యూనియాన్ నాయకులు,డ్రైవర్లు ర్యాలీగా వెళ్లి బస్టాండ్ వద్ద ధర్నా చేశారు. ఆటోలు నడిపి పొట్టపోసుకుంటున్నామని, ఇప్పుడు మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం కల్పించడం వల్ల ఉపాధి కోల్పోయి ఫైనాన్స్ కిస్తీలు కట్టే పరిస్థితి లేకుండా పోతుందని మండిపడుతున్నారు. ఈ రంగంపై ఆధారపడిన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. టాటా ఏస్, ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు పాల్గొన్నారు.
కాసిపేటలో..
సోమగూడెం చౌరస్తాలో ఆటో డ్రైవర్లు, ఓనర్లు ఆందోళన చేపట్టారు. మహాలక్ష్మి పథకంతో రోడ్డున పడ్డామని, ఆటో డ్రైవర్లకు ప్రతి నెలా రూ.15000 జీతం, రిటైర్ట్ ఆటో డ్రైవర్లకు రూ.5000 పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోమగూడెం ఆటో డ్రైవర్లు, ఆటో ఓనర్లు పాల్గొన్నారు.
జన్నారంలో బంద్
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జన్నా రంలో ఆటో,టాటా ఏసీ, జీప్ డ్రైవర్ల యూనియన్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఎక్కడా ప్రైవేట్ వాహనాలు నడిపించలేదు. ఆటో యూనియన్ అధ్యక్షుడు నసీరొద్దీన్ మాట్లాడుతూ మహిళకు ఉచిత బస్ ప్రయాణం కల్పించడం వల్ల తమకు గిరాకీ పడిపోయిందని, మా కుటుంబాల పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి ఆటోలు కొన్నామని, నెలవారీ కిస్తీలు కట్టలేక, పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించలేక అవస్థలు పడుతున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేసి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీప్ యూనియన్ అధ్యక్షుడు షేక్ బాబా, మొగిళి, ప్రభుదాస్, శంకర్, రాజన్న, చాంద్‌పాషా, లక్ష్మణ్, నాయకులు పాల్గొన్నారు.